అతడి కంటె నేను ఘనుడినే అని నిరూపించుకోవాలంటే.. సదరు ‘అతడు’ చేసే పనులన్నీ చేయాల్సిందే.. అంతవరకూ మనకందరికీ తెలిసిన సంగతే గానీ.., అతడు చేసే తప్పులు తాము కూడా చేయాల్సిందే అని ఫిక్సయితే మాత్రం సరదాగా అనిపిస్తుంది. ఇది ఏదో మామూలుగా చిన్నపిల్లలు ఆకతాయిగా ఒకరిని చూసి ఒకరు పంతానికి పోయి వేసుకునే పందేలు కాదు.. నందమూరి హీరోలు ‘తారక్’ లు నిబందనలను అతిక్రమించి.. పోలీసుల ద్వారా చలాన్లు రాయించుకోవడంలో పోటీ పడడానికి సంబంధించిన కబురు.
హైదరాబాదు నగరంలో కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలకు అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసుకోవడం నిషిద్ధం. గతంలో పోలీసులు చాలా దూకుడుగా ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి, నగరం మొత్తం బ్లాక్ ఫిలిం ఉన్న కారు కనిపించకుండా చేసేశారు. కొందరు సెలబ్రిటీలు తమకు బ్లాక్ ఫిలిం లేకపోతే పబ్లిక్‌లో ఇబ్బంది అని ప్రత్యేకంగా అడిగితే పోలీసులు అనుమతి కూడా ఇస్తారు. అయితే సెలబ్రిటీలు చాలా మంది నిబంధనను పట్టించుకోకుండా వాడేస్తూ ఉండడం జరుగుతుంటుంది.
కొన్ని రోజుల కిందట హీరో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ ఫిలిం ఉన్న రేంజి రోవర్ కారులో పోలీసులకు చిక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజున ఇండస్ట్రీ అంతా తారక్ గా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ కు పోలీసులు 1300 రూపాయల ఫైను విధించారు. జూనియర్ అదే తప్పు తో పోలీసులకు దొరకడం అది మూడోసారిట. ఈ తారక్ దొరికిన కొన్ని రోజులకే మరో నందమూరి హీరో ‘తారక్’ అనే పేరుతోనే తాను కూడా పాపులర్ అయిన నందమూరి తారక రత్న (జూనియర్ కు అన్న వరుస) మళ్లీ బ్లాక్ ఫిలిం నేరానికే జూబ్లీ హిల్స్ పోలీసులకు దొరికాడు. తమ్ముడు తారక్ కు 1300 వడ్డించిన పోలీసులు, అన్న తారక్ కు మొదటి తప్పు గనుక.. 700 చలానాతో సరిపెట్టారు. కాకపోతే.. సదరు అన్న తారక్ కారుకు అక్కడికక్కడే మొత్తం బ్లాక్ ఫిలింను తొలగించి మరీ ఇంటికి పంపారు.
సరదా సంగతి ఏంటంటే.. తమ్ముడు అయిన జూనియర్ ఎన్టీఆర్ తో అన్న వరుస అయ్యే తారకరత్న చాలా విషయాల్లో పోటీ పడుతూ టాలీవుడ్ ప్రవేశం చేశాడు. చివరికి తప్పు చేయడంలో కూడా తమ్ముడితో పోటీనేనా అని అంతా నవ్వుకుంటున్నారు.