బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అనగానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియమ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి రైతులు పండించిన కోకోతో హైదరాబాదీలు తయారు చేసిన మనం చాక్లెట్స్ కూడా చేరాయి.
ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని ప్రఖ్యాత రెస్టారెంట్స్, మ్యూజియమ్స్, పార్క్ లు, రెస్టారెంట్స్, వంటకాలు, స్విట్స్ కు సంబంధించి ఓ రిపోర్టును విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా World’s Greatest Places 2024 పేరుతో విడుదల చేసింది.
ఈ ఏడాది చూడాల్సిన మొదటి 100 ప్రాంతాల జాబితాలో బంజారాహిల్స్ లోని మనం చాక్లెట్స్ ను కూడా టైమ్ మ్యాగజైన్ చేర్చింది. ఇక్కడ తయారయ్యే కంపెనీని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కూడా ఉంటుందని, కోకో నుండి చాక్లెట్స్ ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవచ్చని పేర్కొంది.
దీనిపై మనం చాక్లెట్స్ సంస్థ ఫౌండర్ ముప్పాల చైతన్య స్పందిస్తూ… దాదాపు 300రకాల చాక్లెట్స్ ఇక్కడ ఉంటాయని, గత ఏడాదే దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చాక్లెట్ అండ్ కోకో టెస్టింగ్ నుండి లెవల్ 3 సర్టిఫికెట్ పొందిన ఏకైక ఇండియన్ సంస్థ తమదేనని, క్రాఫ్ట్ చాక్లెట్ అనుభవాలను భారతీయులకు అందించాలన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టినట్లు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలో టైమ్ మ్యాగజైన్ గుర్తింపు దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.