నిమిషానికి ఎన్ని సెల్ఫీలు తీయగలరు? గంటలో ఎన్ని లాగించెయ్యగలరు? లెక్కలకోసం కుస్తీ పట్టకండి. గంటలో మహా అయితే 1449 సెల్ఫీలు తీసుకోగలరు. ఇప్పుడున్న గిన్నిస్ రికార్డ్ అంతే. పెట్రిక్ పీటర్సన్ ఈ రికార్డును సెట్ చేశాడు. ఓ హైదరాబాదీ యువకుడు ఈ రికార్డును బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నారు. అతడి పేరు రాచ భాను ప్రకాశ్. ఈనెల 18న దీనికి సుముహూర్తం. ఇందుకోసం గిన్నిస్ వారికి లేఖ రాయడం, వారు ఆమోదించడం జరిగిపోయాయి. కాబట్టి గిన్నిస్ ప్రతినధి సమక్షంలో ఈ చాలెంజ్ జరుగుతుంది. గంటలో 1800 సెల్ఫీలు తీయాలనేది భాను లక్ష్యం.
భాను హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో రీసెర్చి అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఈ రికార్డు కోసం ఉద్యోగానికి గుడ్ బై చెప్పాడు. ఉద్యోగం చేస్తూ సాధన చేయడం సాధ్యం కాదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. రికార్డు స్థాయి సెల్ఫీలు తీయడానికి రోజంతా కుస్తీ పడుతున్నాడు. తదేక దీక్షతో సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం గంటకు 1700 సెల్ఫీలు తీసే స్థాయికి వచ్చాడట. అసలు చాలెంజ్ జరిగే నాడు 1800 సెల్ఫీలు కచ్చితంగా తీస్తానని నమ్మకంగా చెప్తున్నాడు. ఆల్ ది బెస్ట్ భాను.