హైదరాబాద్: మెట్రో రైల్ ఎలైన్మెంట్ మార్చాలంటూ హైదరాబాద్ సుల్తాన్ బజార్లో వ్యాపారులు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రతి దుకాణంముందు ‘సేవ్ సుల్తాన్‌బజార్’ పేరుతో పోస్టర్లు అంటించారు. మెట్రో రైల్ మార్గాన్ని సుల్తాన్ బజార్ మీదగా వెళ్ళకుండా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తాన్ బజార్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.
మెట్రో రైల్ నిర్మాణం మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే కొనసాగుతుందని ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ వీబీ గాడ్గిల్ నిన్న ప్రకటించటంతో తేనెతుట్టెను కదిపినట్లయింది. అసెంబ్లీ ముందుగుండా మెట్రో రైల్ వెళ్ళటంవలన వారసత్వ కట్టడాలకు దెబ్బ తగులుతుందని కొందరు, సుల్తాన్ బజార్ మీదగా వెళ్తే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని వ్యాపారులు మొదటినుంచీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధికారలంలోకి రాకముందునుంచీ వీరి ఆందోళనకు అండగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా మెట్రో రైల్ రూట్ మార్చాల్సిందేనని కేసీఆర్ అసెంబ్లీలోకూడా ప్రకటించారు. మరి ఏమయిందో ఏమోగానీ నిన్న గాడ్గిల్ ప్రకటనతో రూట్ మార్పు కోరుతున్న వర్గాలకు ఖంగు తినిపించింది ప్రభుత్వం. వ్యాపారులు ఇవాళ ఆందోళన మొదలుపెట్టారు. చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ సంఘాల కార్యకర్తలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ ప్రభుత్వం వీరిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.