అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న కట్టడాల కూల్చివేతలపై తగ్గేదేలే అంటూ నేలమట్టం చేస్తోంది. ఫిర్యాదు రావడమే ఆలస్యం.. డాక్యుమెంట్ల పరిశీలన, అనంతరం ఫీల్డ్ లోకి వెళ్లి అక్రమ భవన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.
ఆదివారం ఉదయం మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్దంగా విల్లాలు నిర్మించినట్లు తేలడంతో వాటిని కూల్చివేస్తున్నారు.
మల్లంపేట్ లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు అక్రమ నిర్మాణాలు అని గతంలోనే అధికారులు గుర్తించారు. కాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందటంతో వాటి కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు.
అలాగే.. సంగారెడ్డి అమీర్ పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ , వాణి నగర్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ , మున్సిపల్ అధికారుల సహకారంతో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.