హైడ్రా ఎవ్వరినీ వదలట్లేదు. దూకుడుగా ముందుకే వెళ్తుంది. తాజాగా ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతల్లో కీలక అంశాలు బయటకొస్తున్నాయి.
హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ చెరువు శిఖం భూమిలో ఉన్న టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరీ నిర్మాణ సంస్థ షెడ్డును కూల్చివేయాలని హైడ్రా సమన్లు జారీ చేసింది. రెండు రోజుల్లో మీరు కూల్చండి లేదంటే మేమే కూల్చివేస్తాం అని అల్టీమేటం జారీ చేసింది. దీనికి సదరు సంస్థ కూడ అంగీకరించింది.
ఇక స్వర్ణపురిలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని ఫాంహౌజ్ ను హైడ్రా నేలమట్టం చేసింది. నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేతలు జరిపారు. ఆదివారం ఏకంగా 30 బృందాలు ఏకకాలంలో ఈ కూల్చివేతలను చేపట్టాయి.
మదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేశారు. బిల్డింగ్ యజమానులు నానా హంగామా చేసినా, అధికారులు పోలీసుల సహయంతో జీ+2 నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అమీన్ పూర్ చెరువు పరిధిలోనూ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే, కోర్టుకు సెలవులు ఉన్న రోజే హైడ్రా కూల్చివేతలు చేస్తోందని… కోర్టుకు వెళ్లకుండా హైడ్రా కుట్రలు పన్నుతుందంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. అయినా, ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో కూల్చివేతలపై హైడ్రా వెనక్కి తగ్గటం లేదు.