కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో హైడ్రాకు మరింత బలం వచ్చిటన్లయింది. పటాన్ చెరు సమీపంలో ఇటీవల అమీన్ పూర్ మున్సిపాలిటీలో కలిసిన కిష్టారెడ్డి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి కట్టిన వాటిని నేలమట్టం చేశారు. కిష్టారెడ్డి పేటలో గత పదేళ్లుగా ఎన్ని భూములు ఆక్రమణకు గురయ్యయో లెక్కే లేదు. పట్టించుకున్న వారే లేరు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఇలాంటి స్థలాలు అమ్మి కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు వాటిని కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు.
మూడు ఎకరాలకుపైగా స్థలంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. ఇందులో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకపోయినా కట్టినా ఐదారు అంతస్తుల భవనాలతో పాటు కొన్ని విల్లాలు కూడా ఉన్నాయి. అలాగే కూకట్ పల్లిలో నల్ల చెరువును ఆక్రమించేసుకున్న ఇళ్లను కూల్చివేశారు. అక్కడ ఒకటి, రెండు కుటుంబాలు సామాన్లు తీసుకునే అవకాశం ఇవ్వలేదని ఆందోళనకు దిగారు. అయితే హైడ్రా మాత్రం ఖాళీగా ఉన్న షెడ్లను మాత్రమే కూల్చేస్తున్నామని.. నివాసం ఉన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బయట నుంచి వచ్చి వారు కొన్ని మీడియా సంస్థల కోసం ఆందోళన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కూల్చివేతల్ని అడ్డుకుంటే కేసులు పెట్టేందుకు హైడ్రా సిద్ధపడటంతో ఎవరూ అడ్డం రావడం లేదు. ఆక్రమణలు, ఉల్లంఘనల విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరో వైపు విపక్ష పార్టీలకు చెందిన వారు… కూల్చివేతల సమయంలో ఆందోళనలను హైలెట్ చేస్తున్నాయి.