హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు అతి పెద్ద గండంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రాకు పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా ఇచ్చారు. బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను రెడీ చేస్తున్నారు. కొంత మంది సిబ్బందిని కూడా కేటాయించారు. వారాంతాల్లో బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రా వ్యవహారం రియల్ ఎస్టేట్ వర్గాలలో సంచలనం రేపుతోంది. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లకు ఆయుధంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా హైడ్రా లోగోను మార్చారు. అందులో నీటి వనరుల్ని కాపాడే సంస్థలా సందేశం ఇచ్చారు. చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు ఈ సంస్థ ఉందన్నట్లుగా సందేశం ఇస్తున్నారు. హైడ్రా ఏర్పాటు కాక ముందు జరిగిన అక్రమ నిర్మాణాలతో సంబంధం లేదని ఆ తర్వాత వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. కానీ వసంత ప్రాజెక్ట్సులో మాత్రం గతంలో చేసిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ వ్యవహారంపై ఆ సంస్థ యజమానికి వసంత కృష్ణప్రసాద్ కోర్టులో కేసు వేశారు.
హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రతి అంశంలోనూ వివాదాలున్నాయి. కోర్టు కేసులున్నాయి. అయినా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడుతూనే ఉన్నారు. ప్రభుత్వ భూమి అని నిర్ణయించేసుకుని రాత్రికి రాత్రి కూలగొడుతున్నారు. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఓ పద్దతి ఉంటుందని హైడ్రా భావించకపోవడంతో .. రియల్ ఎస్టేట్ వర్గాలు.. రిస్క్ ఎందుకని కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్ ఏర్పాటు తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళన కూడా రియల్ వర్గాల్లో ఉంది.