హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణం అయిన హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. అయినా హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు. ఈ పరిస్థితిని గుర్తించి హైడ్రా తాజాగా ఓ ప్రకటన చేసింది.
కూల్చివేతలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వర్గాల్లో నెలకొన్న భయాందోళనలపై హైడ్రా స్పష్టతనిచ్చింది. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని, చట్టబద్ధంగా చేపట్టిన వెంచర్ల విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా కల్పించింది. రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ భరోసా ఇచ్చారు. ‘చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, చెల్లుబాటయ్యే అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయడం జరగదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది’’ అని హైడ్రా స్పష్టం చేసింది.
హైడ్రా ప్రకటనతో కొనుగోలుదారుల్లో మునుపటి ఉత్సాహం వస్తుందో రాదో కానీ బిల్డర్లలో మాత్రం నమ్మకం పెరుగుతోంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే ఎలాంటి సమస్యలు రావని నమ్మకంతో పనులు ప్రారంభిస్తున్నారు. హైడ్రా రెండో విడత యాక్షన్ ప్రారంభమయ్యాక.. కార్యచరణను బట్టి కొనుగోలుదారులు తమ నిర్ణయాలను ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది.