ప్రకృతి వనరులను ధ్వంసం చేసి.. ఆక్రమణలు చేపడితే ఎలా ఉంటుందో ఇటీవలి బుడమేరు వరద కళ్లకు కట్టినట్లుగా చూపించింది. బెజవాడను దుఃఖదాయినిగా మార్చిన బుడమేరును ప్రక్షాళన చేపట్టేందుకు ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి.
బుడమేరు మిగిల్చిన నష్టం..ప్రజలు పడిన కష్టం ఇప్పటికిప్పుడు మరిచిపోయేది కాదు. వారం రోజులకు పైగా బెజవాడ వాసులు బురదలోనే నరకం అనుభవించాల్సి వచ్చింది. బుడమేరు చుట్టూ ఆక్రమణలు చేపట్టడం ప్రజల పాలిట శాపంగా మారడంతో… వాటిని తొలగించడంపై ఏపీ సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టింది.
త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కాలువల్లో ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణలో తీసుకొచ్చినట్లుగా హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలోనూ తీసుకొస్తామని, అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు భారీగా చేపట్టడంతోనే ఇటీవలి విజయవాడ విలయం అని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని, అక్రమ నిర్మాణాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని తెలిపారు.
మరోవైపు… పేదల విషయంలో కఠినంగా వ్యవహరించబోమని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే ఆక్రమణలను తొలగిస్తామని నారాయణ వెల్లడించారు. బుడమేరు వరదలు మానవ తప్పిదం అంటూ ఆరోపిస్తున్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ…ఇది మానవ తప్పిదం కాదు.. వైసీపీ నిర్లక్ష్యం అని కుండబద్దలు కొట్టారు.