అక్రమం అయితే బ్యాంకులు లోన్ ఎందుకు ఇస్తాయి…? రూపాయి రూపాయి పోగేసుకొని కొంటే కూల్చేస్తారా…? మీ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టింది… ముందు వారి ఉద్యోగం తీసేయండి ఇలాంటి మాటలు హైడ్రాకు రెగ్యూలర్ గా ఎదురవుతున్నాయి. చూసే వారు కూడా నిజమే కదా అని కామెంట్ చేస్తున్నారు.
దీంతో, అక్రమ కట్టడాలకు బ్యాంకు లోన్లు దక్కకుండా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల్లో బ్యాంకర్లతో భేటీ కాబోతుంది. ఈ మేరకు హైడ్రా అధికారికంగా బ్యాంకులకు లేఖలు రాసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ మీటింగ్ ను నిర్వహించబోతున్నారు.
ఎప్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు అక్రమ నిర్మాణాలుగా గుర్తించి, కూల్చివేస్తున్నాం. ప్రభుత్వం నుండి అనుమతులను కూడా కఠినతరం చేస్తున్నాం. ఈ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు మంజూరు చేయటం వల్ల కొనుగోలుదారుడికి, బ్యాంకర్లకు కూడా నష్టమే అని వివరించబోతున్నారు. ముందుగా ప్రభుత్వరంగ బ్యాంకర్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించటంతో పాటు సదరు నిర్మాణాలకు లోన్స్ ఇచ్చిన సంస్థలను కూడా హైడ్రా గుర్తించింది. వాటికి సంబంధించిన అన్ని రకాల పేపర్లను సేకరించింది. ఇక, హైడ్రాకు అనుబంధంగా లీగల్ టీంను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు.