వీకెండ్ వచ్చిందంటే చాలు… హైడ్రా బుల్డోజర్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట కూల్చివేతలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా హైడ్రా తన స్పీడ్ తగ్గించింది. అయితే, తెలంగాణ మంత్రివర్గంతో పాటు సుప్రీంకోర్టు తాజా తీర్పుల నేపథ్యంలో ఈ వారం హైడ్రా పెద్ద కూల్చివేతలే ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చెరువు శిఖం భూముల్లో ఉన్న ఓ బడా కంపెనీకి చెందిన హైరైజ్ అపార్ట్మెంట్ లోని రెండు భారీ భవనాలను కూల్చబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం హైడ్రా పెద్ద మెషనరీని వాడుకోబోతుందని, ఇప్పటికే చర్చలు జరిపినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇటీవల బుల్డోజర్ జస్టిస్ ను ఆపాలంటూ పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ… చెరువుల ఆక్రమణల్లో మాత్రం ప్రభుత్వాల ఇష్టం, తమ తీర్పు వర్తించందు అంటూ కామెంట్ చేసింది. తీర్పు వచ్చిన కాసేపటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. దీన్ని బట్టి హైడ్రా ఏం చేయబోతుందో, చెప్పకనే చెప్పినట్లైంది.
పైగా హైడ్రాకు మరిన్ని ఆధారాలు కట్టబెడుతూ తెలంగాణ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. సీఎం పదే పదే హైడ్రా ఆగదు అంటూ ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో, హైడ్రా మరోసారి కూల్చివేతలకు దిగబోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.