హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఫామ్ ప్లాట్ల హవా నడుస్తోంది. ఫామ్ ప్లాట్లు అంటే పొలాన్నే ప్లాట్లుగా చేసి అమ్మేయడం. అది వ్యవసాయ భూమిగానే రికార్డుల్లో ఉంటుంది. వ్యవసాయానికే ఉపయోగించుకోవాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫార్మ్ ల్యాండ్ కొంటే వీకెండ్లో వెళ్లి వ్యవసాయం చేసుకోవచ్చని…లేదా సేద తీరేందుకు ఉపయోగపడతాయని, భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడతాయని ఆశపెట్టి అమ్మేస్తున్నారు.
ఈ ఫామ్ ప్లాట్లపై భారీగా ఫిర్యాదులు వస్తూంటంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. చట్ట ప్రకారం ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదని రంగనాథ్ స్పష్టంచేశారు.
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి, కొనడానికి లేదని రంగనాథ్ స్పష్టం చేసారు. 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉంటేనే ఫార్మ్ ల్యాండ్ అంటారని ప్రభుత్వ చెబుతోందని అన్నారు. అలాంటి వాటినే రిజిస్ట్రేషన్ చేయాలని అలా కాకుంటే రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
31.8.2020న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 131 వ జీవో ప్రకారం అనధికారికంగా లే ఔట్లలో వేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రూల్స్ పాటించడం లేదని పార్కులు, రోడ్ల కోసం స్థలం కేటాయించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఇలాంటి కొంటే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వాధికారులు బాధ్యులు కారని హెచ్చరించారు. అలాంటి భూముల కొనుగోలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఫామ్ ప్లాట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇరవై గుంటలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అవుతుంది కదా అని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు కూడా మారాల్సి ఉందని.. నిబంధనలు ముందుగా ప్రభుత్వం అమలు చేయాలన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.