శనివారం రోజు హైడ్రా బుల్డోజర్లకు పని పెట్టింది. అలా వెళ్లి నాలుగు కూల్చివేతలు చేపట్టి.. ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. అది నిజమే అయితే.. అలాంటి డ్రైవ్లు నాలుగు చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి కంచ గచ్చిబౌలి భూముల కోసం తలబొప్పి కట్టించుకునేంత పోరాటం చేయాల్సిన అవసరడం ఉండదు. నెలకోసారి హైడ్రానే కావాల్సినన్ని ఖరీదైన భూముల్లో జెండా పాతి ఇస్తుంది..అమ్మేసుకోవచ్చు.
పబ్లిసిటీ కోసం చేస్తున్నారో … రాజకీయ నేతల సెటిల్మెంట్లలో భాగమై చేస్తున్నారో కానీ.. కనీసం పద్దతి లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. మైలవరం ఎమ్మెల్యేకు చెందిన భూములపై వివాదం ఉంటే.. వాటిపై కేసులు సుప్రీంకోర్టులోఉంటే.. వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ అదేనా ?. ఇరవై ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసుకుని.. అన్ని పత్రాలు ఉన్నాయని సమర్పించిన తర్వాత కూడా మా రికార్డుల్లో ప్రభుత్వ భూమే అని కూల్చేస్తారా?. అక్కడేదో పొలిటికల్ సెటిల్మెంట్ ఉందని .. అది తేలలేదని వస్తున్న ఆరోపణలు దేనికి సంకేతం ?
నార్నె ఎస్టేట్స్ కబ్జా చేసిందని .. తాము కాపాడేశామని చెప్పిన స్థలాల్లో ఇప్పటికే అది ప్రభుత్వ స్థలమని బోర్డులు ఉన్నాయి. వాటిలో ఆడుకోనివ్వడం లేదని ఆ బాలుడు లేఖ రాస్తే హైడ్రా స్పందించి భూమిని కాపాడిందట. దానికి రూ.3900 కోట్లు కాపాడినట్లుగా ప్రకటన. ఇంజాపూర్ లో హైడ్రామా దారి చూపించిందని కొంత మందితో డ్రామాలు కూడా ఆడించారు. అక్కడ. ఐస్క్రీమ్ కంపెనీ కట్టిన చిన్న షెడ్లను కూల్చివేశారంతే.
హైడ్రాపై ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. బుల్డోజర్లతో వెళ్లి కూల్చివేస్తే అది గొప్పతనం కాదు. అది ప్రభుత్వ భూమి అని లీగల్ గా క్లెయిమ్ చేసుకుని కూల్చివేయాలి. చెరువులు, బఫర్ జోన్లలో ఎలా నిర్దారిస్తున్నారో అలాగే చేయాలి. కానీ హైడ్రా … రాజకీయ సెటిల్మెంట్లలో ఆయుధంగా మారినట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వచ్చేలా చేయకూడదన్న అభిప్రాయం వినిపిస్తోంది.