తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో జూ. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ శ్రీనివాస రావుకు చెందిన కంపెనీ చేపట్టిన ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. జూబ్లీహిల్స్ లోని 39 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అనూహ్యంగా కంచెలు వేయడంతో ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. దాంతో ఆ భూములను పరిశీలించిన హైడ్రా అధికారులు.. నార్నే ఎస్టేట్స్ నిర్మించిన కంచెలను కూల్చి ప్రభుత్వ భూములు అని కొత్త బోర్డులను ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ లో ఎకరం 100కోట్లు పలికే 39 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అకస్మాత్తుగా కంచెలు ఏర్పాటు కావడంపై హైడ్రాకు ఓ బాలుడు లేఖ రాశాడు. అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో నార్నే సంస్థ బోర్డులు ఏర్పాటు చేసింది. హైడ్రాకు లేఖ రాసిన ఆ బాలుడు నిత్యం ఆ స్థలంలో క్రికెట్ ఆడేవాడు. రాత్రికి రాత్రి ఆ భూముల్లో కంచెలు ఏర్పాటు కావడంపై అనుమానంతో హైడ్రాకు బాలుడు రాసిన లేఖ ద్వారా అధికారులు వెంటనే కదిలారు. ఆ భూముల రికార్డ్ లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించగా.. ఆ భూమి ప్రభుత్వానిదేనని , ప్రస్తుతం ఆ ల్యాండ్ పై వివాదం నడుస్తోందని తెలిపారు.
వివాదాస్పద భూముల్లో నిర్మాణాలు చేపట్టడం , అమ్మకాలు చేయడం వంటివి చట్టవిరుద్ధం అన్నారు రంగనాథ్. నార్నే రియల్ ఎస్టేట్ సంస్థనే ఈ భూములను కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది. ప్రభుత్వ భూముల్లో నార్నే ఎస్టేట్ కంచెలు ఏర్పాటు చేసిందని హైడ్రా ప్రకటనపై నార్నే కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆ కంపెనీ స్పందించాక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.