హైడ్రా సెలవుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పుడల్లా ఎలాంటి కూల్చివేతలు ఉండబోవని సంకేతాలు పంపింది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. హైదరాబాద్ మొత్తాన్ని హైడ్రా కూల్చేస్తుందన్నట్లుగా సోషల్ మీడియాలో చేసిన ప్రచారంతో అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. బయట చేస్తున్న డిమోలిషన్లతో తమకు సంబంధం లేదని.. తాము ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క పేద, మధ్యతరగతి ఇంటిని కూడా కూలగొట్టలేదని హైడ్రా చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు.
ప్రపంచంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా ఆ దృశ్యాలు చూపిస్తూ హైడ్రా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైనాలో జరిగిన కూల్చివేతల వీడియోలను కోకాపేటలో హైడ్రా కూల్చివేతలని హడావుడి చేశారు. అలాగే.. హైడ్రా అనే పేరు వినిపిస్తేనే పానిక్ సృష్టించేలా ప్రచారం చేస్తూండటంతో రంగనాథ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలగొట్టేది లేదని స్పష్టం చేశారు.
హైడ్రా ప్రధాన ఉద్దేశం చెరువులను కబ్జాల నంచి కాపాడటమేనన్నారు. మూసి సర్వేతో అసలు హైడ్రాకు సంబంధంలేదని అక్కడ కూల్చివేతలపై ఎలాంటి ప్రణాళికలు కూడా లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు నిలిపివేసినట్లే. దీపావళి పండుగ తర్వాత పరిస్థితుల్ని బట్టి.. హైడ్రాను యాక్టివేట్ చేయడమా లేదా ప్రత్యామ్నాయ ప్రణాళికల్ని అమలు చేయడమా అన్నది తేల్చేస్తారు.