పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు స్థానాలూ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పంపకం కొంతమంది జనసైనికులకు నచ్చడం లేదు. ఇప్పటివరకూ పార్టీ జెండా మోసినవాళ్లు, పవన్ వెంట నడిచిన వాళ్లలో ఓ వర్గం తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతోంది. పవన్ మరీ ఇన్ని తక్కువ సీట్లు ఎలా తీసుకొన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై… హైపర్ ఆది స్పందించాడు. తనదైన శైలిలో… వ్యతిరేక వర్గానికి వివరణ ఇచ్చాడు. హైపర్ ఆది జనసేనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎప్పటి నుంచో తన మద్దతు తెలుపుతున్నాడు. అవసరం అయినప్పుడల్లా జనసేన తరపున గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. జనసేన సీట్ల పంపకంపై కూడా తనదైన వివరణాత్మక, విశ్లేషణాత్మక వివరణ ఇచ్చాడు.
పార్టీని అభిమానించేవాళ్లే ఇంత ఆలోచిస్తుంటే, పార్టీని స్థాపించిన వాడు, పార్టీని పదేళ్లుగా నడుపుతున్నవాడూ ఇంకెంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడో ఒక్కసారి గుర్తెరగమని జనసైనికులకు హితవు పలికాడు హైపర్ ఆది. ఈ సందర్భంగా పవన్‌ని ధోనీతో పోల్చాడు హైపర్. ధోనీ కూడా తన తొలి వన్డేలో డకౌట్ అయ్యాడని, ఆ తరవాత క్రమంగా నిలదొక్కుకొని, క్రికెట్ నే శాశించే స్థాయికి ఎదిగాడని, పవన్ కూడా తొలిసారి ఓడిపోయాడని, ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టి, రాజకీయాలకే తలమానికంగా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ప్రతిపక్షంలో ఉంటూ, జనం కోసం జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అనీ, పిల్లల కోసం దాచుకొన్న డబ్బులు సైతం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడని, పార్టీని పదేళ్లుగా నడుపుతున్నాడని, ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా, అభిమానులు, జనసైనికులు వెంట ఉండాలని, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, నచ్చని పని చేసినప్పుడు మరోలా మారడం అభిమానం అనిపించుకోదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
నిజానికి హైపర్ ఈ పొలిటికల్ సినారియోనీ బాగా అర్థం చేసుకొన్నాడనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్‌కి పది సీట్లు వచ్చినా, ఇప్పుడు 30, 40 సీట్లు గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉండేది. పవన్ రెండు చోట్లా ఓడిపోయాడు. అలాంటప్పుడు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఎలా వస్తుంది. ఇచ్చిన 24 సీట్లలో కనీసం 20 సీట్లు గెలిపించుకొన్నా పవన్.. గేమ్ ఛేంజర్ అవుతాడు. ఈ విషయం జనసైనికులు గుర్తించాలి.