పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను, పెండింగులో ఉన్న బిల్లులపై చర్చ, ఆమోదం వంటి ప్రజాహిత పనులన్నిటినీ పక్కన పెట్టేసి అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంపై విమర్శలు, ఆరోపణలు చేస్తుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి. ఇప్పుడు ఆ కుంభకోణం వలన సుప్రీం కోర్టుపై కూడా అదనపు పని భారం పడింది. ఆ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి. త్యాగిల్పి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడానికి అనుమతించవలసిందిగా ఎమ్.ఎల్.శర్మ అనే న్యాయవాది ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలు చేసారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. టాకూర్, జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దానిని విచారణకు స్వీకరించి, వచ్చే వారంలో దానిని విచారణకు చేపడతామని చెప్పింది.
అగస్టా కుంభకోణంపై ఈ హడావుడి అంతా ఉత్తరాఖండ్ వ్యవహారంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల దాడి నుంచి తప్పించుకోవడానికేనని అనుమానించవలసి వస్తోంది. ఎందుకంటే ఇదేమీ ఈరోజు కొత్తగా జరిగిన కుంభకోణం కాదు. 2013లోనే దీనిపై సిబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అప్పటి నుంచి అది సాగూతూనే ఉంది. ఆ కేసులో దోషులను గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఇది చాలా ఎక్కువ సమయమే కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా శిక్షించలేకపోయారు. కనుక కొన్ని రోజులు దీనిపై హడావుడి చేసిన తరువాత మళ్ళీ ఈ కేసును అటకెక్కించడం ఖాయం. బహుశః అందుకే సోనియా గాంధీ ఈ కేసును చూసి తానేమీ భయపడటం లేదని అంత నిబ్బరంగా చెపుతున్నారేమో?