ఓటర్ల లిస్ట్ సరిగ్గా లేదు..!
22 లక్షల మంది ఓట్ల గల్లంతు..!
పోలింగ్ శాతంపై గందరగోళం..!
మాక్ పోలింగ్ చేయించడం చేత కాలేదు..!
పోలింగ్ సిబ్బందికి రికార్డు మెయిన్ టెయిన్ చేయడం చేతకాలేదు..!
మాక్ పోలింగ్ చేసిన ఈవీఎంలలోనే అసలు పోలింగ్ చేయించారు..!
ఇలా చెప్పుకుంటూ.. పోతే ఎన్నికల సంఘం పని తీరు ప్రత్యేకంగా రికార్డు చేసి.. మ్యూజియంలో భద్రపరచాల్సిన గొప్పగా ఉంది. 2 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు ఉన్న తెలంగాణలో 22 లక్షల మంది ఓటర్లు గల్లంతు కావడం అంటే.. చిన్న విషయమా..? దీనికి సారీ చెప్పి.. రజత్ కుమార్ సైనీ తప్పించుకోవడం సమంజసమేనా..?
టెక్నాలజీ పెరిగిపోయిన పరిస్థితుల్లో పోలింగ్ శాతాన్ని మదింపు చేయడానికి 30 గంటల సమయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. పోలింగ్ స్టేషన్లు ఎడారుల్లో ఉండే రాజస్థాన్ లో కూడా… పోలింగ్ ముగిసిన ఒకటి, రెండు గంటల్లోనే.. పోలింగ్ శాతంపై క్లారిటీ వచ్చింది. కానీ… తెలంగాణలో మాత్రం… చాలా ఆలస్యంగా.. భయం..భయంగా.. పోలింగ్ శాతాన్ని ప్రకటించారు ఎన్నికల అధికారి. ఇది ఆయన అంతకు ముందు ప్రకటించిన దాని కన్నా.. 4 శాతం అధికం. ఇంత శాతం ఎక్కువ ఎలా నమోదయింది…? లెక్కలు చేతకాలేదా..? లేక ఏమై గూడు పుఠాణి జరిగిందా..?. కార్వాన్ నియోజకవర్గంలో అయితే.. అసలు ఎన్ని ఓట్లు పోలయ్యాయనే పత్రాలే చాలా పోలింగ్ బూత్ ల నుంచి అందలేదట.
చాలా చోట్ల… పోలయిన ఓట్లకు.. ఈవీఎంలో నమోదైన ఓట్లకు మధ్య చాలా తేడా ఉంది. ఒకటి, రెండు చోట్ల మాత్రమే బయటకు వచ్చినా .. చాలా చోట్ల ఇదే సమస్య వచ్చింది. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ లో వచ్చిన ఓట్లను తొలగించకపోవడతోనే ఈ సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం..మాక్ పోలింగ్ నిర్వహించే ఈవీఎం వేరుగా ఉంటుంది. అందుకే ఈ కారణాన్ని చాలా మంది నమ్మడం లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ సిబ్బంది… లెక్కాపత్రం లేకుండా.. ఈవీఎంలలో ఓట్లు తమ అనుకూల పార్టీలకు వేసేయడం వల్లే సమస్య వచ్చిందని… ఈ విషయంలో ఎన్నిక సంఘం టెన్షన్ పడుతోందనే ప్రచారం… మీడియా వర్గాల్లో జరుగుతోంది. ఏం జరిగినా.. ఎన్నికలు మాత్రం.. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం.. ” ఫ్రీ అండ్ ఫెయిర్”గా జరగలేదన్న విషయం మాత్రం స్పష్టంగా బయటపడుతోంది.