“ఇప్పుడు కావాలనుకుంటే.. ఇప్పుడే ముఖ్యమంత్రిని కాగలను..” అని డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని రాజస్థాన్‌లో వ్యాఖ్యానించడం… ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. అసలు ఎప్పుడూ రాజకీయ పదవుల గురించి పెద్దగా ఆసక్తి చూపని..మాట్లాడని హేమమాలని… సీఎం పదవి పొందడం తనకు పెద్ద విశేషం ఏమీ కాదని చెప్పుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన హేమమాలిని… 2004లో బీజేపీలో చేరినప్పటి నుంచి ఆమె ఎన్నికల ప్రచారాల్లోనే ఎక్కువగా పాల్గొన్నారు. సినిమాలతో పాటు… కుమార్తెలతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇస్తూంటారు. ఎన్నికల ప్రచారం, మధురలో తప్పితే.. ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించరు కూడా. అలాంటి ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిపై ఎందుకు మాట్లాడారన్నది హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం అతి పెద్ద పార్టీగా నిలబడాలన్న బీజేపీకి … యూపీలో కనీస సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. విపక్షాలన్నీ ఏకమవడంతో.. బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొంత కాలంగా యోగి ఆదిత్యనాథ్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. యోగి తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయనపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఆయనకు చెక్ పెట్టాలని అమిత్ షా, నరేంద్రమోడీ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలోనే హేమమాలిని యూపీ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిజానికి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయడం మోదీ, షాలకు ఇష్టం లేదు. ఆర్ఎస్ఎస్ పెద్దల వల్లే యూపీ సీఎం కాగలిగారు ఆదిత్యనాధ్. వచ్చే ఎన్నికల్లో కనీస సీట్లు గెలుపొందాలంటే.. ఉత్తరప్రదేశ్ లో నాయకత్వ మార్పు అవసరమని మోదీ-షా భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే హేమామాలినిని రంగంలోకి దింపాలని బీజేపీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. ఎస్పీ-బీఎస్పీ మహాకూటమిని గ్లామర్‌తో కొట్టాలని గుజరాత్ ద్వయం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు హేమా మాలినిని సీఎం పీఠంపై కూర్చొబెట్టి.. అప్పటివరకు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రజలు మర్చిపోయేలా చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.