ఏపీలో టిక్కెట్ రేట్ల తగ్గింపు అంశంపై అటు ఎగ్జిబిటర్లు.. ఇటు నిర్మాతలు కిందా మీదా పడుతున్నారు. ఏపీ ప్రభుత్వంతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మోహన్ బాబు సహా అందరూ టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని.. అలా నిర్ణయించడం సరి కాదని అన్నారు. అయితే ఒక్క నాగార్జునకు మాత్రం ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంలో ఎలాంటి ఇష్యూస్ లేవని చెబుతున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ వాయిదా పడటంతో… బంగార్రాజుకు స్పేస్ దొరకడంతో ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమవతున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్మీట్ పెట్టారు. అందులో టిక్కెట్ల అంశంపై మాట్లాడలేనంటూనే కొన్ని సమాధానాలు ఇచ్చారు. ‘సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను’ అని తేల్చి చెప్పారు . ఏపీలో మీ సినిమాపై కమర్షియల్ గా ఎఫెక్ట్ పడుతుందేమోనని జర్నలిస్టులు ప్రశ్నిస్తే .. ‘నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే..’ అని బదులిచ్చారు . దీంతో సినీ పరిశ్రమకు కూడా షాక్ తగిలినట్లయింది. ఎవో కాసిని డబ్బులు వస్తాయి.. లేకపోతే లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది.
తన గురించి మాత్రమే నాగార్జున ఆలోచించారని.. మిగతా ఇండస్ట్రీ గురించి ఆయన డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎం జగన్కు నాగార్జున అత్యంత సన్నిహితుడు. వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతూంటారు. ఈ సందర్భంలో ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదని.. ఏదో విధంగా కవర్ అవుతుందని నాగార్జున భావిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.