మాస్, కమర్షియల్ సినిమాలు ఎవరైనా తీస్తారు. దానికి దర్శకుడి అభిరుచితో సంబంధం లేదు. కమర్షియల్ లెక్కలు తెలిస్తే చాలు. కానీ.. ‘ఓనమాలు’ లాంటి సినిమా తీయడానికి ధైర్యం ఉండాలి. అలా తొలి అడుగే ధైర్యంగా వేసిన దర్శకుడు క్రాంతి మాధవ్. ఆ తరవాత శర్వానంద్ తో తీసిన ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ కూడా దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ముచ్చటగా మూడో ప్రయత్నంగా.. సునీల్‌తో ‘ఉంగరాల రాంబాబు’ తెరకెక్కించారు క్రాంతిమాధవ్. ఈనెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా క్రాంతిమాధవ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
* ‘ఉంగరాల రాంబాబు’.. సెంటిమెంట్లు, మూఢనమ్మకాలపై సెటైరా?
– ఈ సినిమాలో ఎవరిపైనా సెటైర్లు వేయడం లేదు. రాంబాబు అనే ఓ స్వార్థపరుడి కథ ఇది. తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. ఓ బాబాని నమ్ముతాడు. అదీ స్వార్థం కోసమే. అలాంటి ఓ వ్యక్తి… మనిషిగా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ.
* సునీల్‌ది కామెడీ టైపు.. మీ కథలో భావోద్వేగాలు కనిపిస్తాయి. మరి ఈ సినిమా ఏ టైపు?
– రెండూ ఉంటాయి. జోనర్ పరంగా ఇదో కామెడీ చిత్రం. కానీ నాదైన భావోద్వేగాలు ఉంటాయి. నేను నేను అనుకొనే వ్యక్తి… మనం అని అందరి గురించీ ఆలోచిస్తాడు. ఆ జర్నీలో నాతాలుకూ ఎమోషన్స్ కనిపిస్తాయి.
* తొలిసారి కామెడీ టచ్ చేశారు..
– అవునండీ.. నా కెరీర్లో మహా అయితే పది సినిమాలు చేస్తానేమో. అంతకంటే ఎక్కువ స్పీడు నా వల్ల కాదు. ఈ పది సినిమాలూ పది రకాల జోనర్లలో ఉండాలని భావిస్తా. పైగా కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కామెడీ పండించడమే చాలా కష్టం. ఓ సీరియెస్ కథ తీసుకొని, ఎమోషన్ డ్రైవ్ చేస్తూ కథ చెప్పేయడం ఓ దర్శకుడిగా ఈజీ. ఎందుకంటే సినిమాకొచ్చే ప్రేక్షకులకు రకరకాల సమస్యలుంటాయి. వాళ్లంతా ఎక్కడో చోట కనెక్ట్ అయిపోతారు. దర్శకుడిగా నేను పాస్ అయిపోతా. కానీ అన్ని సమస్యలతో థియేటర్‌కి వచ్చే వ్యక్తిని నవ్వించడం తలకు మించిన పని.
* సునీల్‌ని కొత్తగా చూపించారా?
– దాదాపు 400 సినిమాలు చేసిన నటుడు సునీల్. అన్ని రకాలుగానూ నవ్వించేశాడు. సునీల్‌తో కొత్తగా ప్రయత్నించడం కష్టం. అయితే ఓ కొత్త కథ దొరికితే.. అందులో సునీల్ కామెడీ కొత్తగా ఫీలవుతారని బలంగా నమ్మా. సునీల్ కూడా ఇది వరకటి సునీల్‌లా కనిపించడు. తనదైన
ఓ కొత్త డైమెన్షన్ ఈ సినిమాలో చూస్తారు.
* బాబాల హవా, వాళ్లపై కాంట్రవర్సీ సాగుతోంది. వాటి గురించి మీ సినిమాలో ప్రస్తావించారా?
– బాబాల్ని నమ్మడం ఓ బలహీనత. దేవుడ్ని నమ్మడం బలం అని భావిస్తా. నేను దేవుడ్ని నమ్ముతా. బాబాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంటుంది గానీ, వాళ్ల గురించి పెద్దగా చర్చించలేదు.
* విడుదల మరీ ఆలస్యమైందేంటి?
– ప్రతీ కథ.. విత్తనం లాంటిదే. కానీ ఏ విత్తనం ఎప్పుడు మొక్కగా మొలకెత్తుతుందో చెప్పలేం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే నాపని.
* గత రెండు సినిమాల కమర్షియల్ సక్సెస్ పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా?
– ఓనమాలు దర్శకుడిగా నాకు పేరు తీసుకొచ్చింది. నేను చూసిన నా ఊరి కోసం రాసుకొన్న కథ అది. కమర్షియల్‌గా డబ్బులు రాలేదు. ఆ సినిమాతో నా సేవింగ్స్ అన్నీ పోగొట్టుకొన్నా. మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు మాత్రం.. దాని బడ్జెట్‌కి, దాని స్థాయిలో బాగానే రిటర్న్ రాబట్టుకొంది.
ప్రతీ సినిమాకీ ఎంత పెట్టాం? ఎంత వచ్చింది? అనే లెక్కలు వేసుకోలేం. మనసులో కొన్ని భావాలుంటాయి. అవి చెప్పాలనుకొన్నప్పుడు చెప్పేయాలి.
* కమర్షియల్ లెక్కలూ అవసరమే కదా?
– అవసరమే. కానీ దృష్టిలో కమర్షియల్ సినిమా వేరు, ఆర్ట్ సినిమా వేరు అని ఉండదు. సినిమాని అందరూ టికెట్ కొనే చూస్తారు. ఫ్రీగా ఎవరూ చూపించరు. టికెట్ కొన్నాడంటే అది కమర్షియల్ సినిమాకిందే లెక్క.
* ఎలాంటి కథలు రాసుకోవడం ఇష్టం..?
– నా చుట్టూ జరిగే విషయాల్లోంచే కథలు పుడతాయి. అవే జనాలకు త్వరగా చేరువ అవుతాయని నా నమ్మకం. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు కొత్త కథలేం కావు. సమాజంలో ఉన్నదే మరోసారి గుర్తు చేశానంతే.