ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఐ లవ్ జగన్ అని హీరో విశాల్ రెడ్డి ప్రకటించారు. తన కొత్త సినిమా లాఠీ ప్రమోషన్ లో భాగంగా తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు సినిమా కన్నా ఎక్కువగా రాజకీయ పరమైన ప్రశ్నలే ఎదురయ్యాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం నుంచి విశాల్ పోటీ చేస్తారన్న ప్రచారంపై ఆయనను మీడియా ప్రతినిధులు ఎక్కువగా అడిగారు. అయితే జగన్ అంటే తనకు ఇష్టమని ఎంత డైరక్ట్ గా చెప్పారో.. కుప్పం నుంచి పోటీ చేసేది లేదని.. అసలు ఏపీ రాజకీయాల్లోకి రానని అంతే సూటిగా స్పష్టంగా చేశారు.
కుప్పం నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉన్న్ మాట నిజమేనని విశాల్ చెప్పుకొచ్చారు. తన తండ్రి కృష్ణారెడ్డి ఒకప్పుడు కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. ఆయనకు సహాయంగా తాను కుప్పంలో ఉన్నానన్నారు. కుప్పంలో ప్రతి వీధి తనకు బాగా తెలుసని అన్నారు.. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన ,ఎక్కువ ప్రజాభిమానం ఉందని … తనకు ఆ పదవి చిన్నదని స్పష్టం చేశారు. లాఠీ సినిమా ప్రతి టికెట్ ఆదాయంలో ఒక రూపాయి పక్కన పెట్టి రైతులకు సాయం చేస్తానని తెలిపారు. సోషల్ సర్వీస్ చేసే ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడేనని, అలా తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.
కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చాలా మందిని వైసీపీ ప్రత్యామ్నాయంగా చూసింది. అందులో విశాల్ ను వైసీపీ హైకమాండ్ మంచి చాయిస్ గా భావించింది. ఆ ప్రకారం ఆయనపై మీడియాలో అనూహ్యంగా ప్రచారం చేయించింది. అయితే విశాల్ మాత్రం అంతే సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించారు. ఆయన ఆసక్తి చూపించి ఉంటే.. ఈ పాటికి కుప్పం అభ్యర్థిగా విశాల్ ఉండేవారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.