వైసీపీలో పదవులు పొందితే. .. వారిపై ఐ ప్యాక్ నిఘాను ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. వారు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుమతించాల్సిందే. గతంలో ఇది ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేది కానీ ఇప్పుడు లోకల్ వరకూ వచ్చేసింది. గుంటూరు కౌన్సిల్ మీటింగ్ లో ఐ ప్యాక్ సిబ్బందిని కూర్చోబెట్టడంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. అన్ని చోట్లా అలాగే జరుగుతోందని.. అధికారుల మధ్యలో వారు కూర్చుంటూండటం వల్ల చాలా చోట్ల గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. అసలు ఈ ప్యాక్ సిబ్బంది ని ఇలా కౌన్సిల్ మీటింగ్లకు ఎందుకు తీసుకు వస్తున్నారన్నది అర్థం కాని విషయం.
వైసీపీలో అన్ని స్థాయిలోనూ ఐ ప్యాక్ నిఘా
సొంత పార్టీ నేతల పని తీరును ఎసెస్ చేయడానికి.. ద్వితీయ శ్రేణి నేతల పని తీరును గుర్తించడానికి ఇలా రెండో వ్యవస్థను వైసీపీ ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారు. గుంటూరులో కార్పొరేటర్ల పని తీరుపై .. వారు ఇలా కార్పొరేషన్ మీటింగ్ లోనే కూర్చుని … నివేదికలు రాసుకుంటున్నారని అంటున్నారు. ఓ రకంగా అది నిఘా పెట్టడమే. తమపై నిఘా పెట్టడాన్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ వైసీపీలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా నిఘాను ఒప్పుకోవాలి. లేకపోతే జరిగేది వేరుగా ఉంటుంది. అందుకే.. వారు.. ఐ ప్యాక్ సభ్యులకు తమపై నిఘా పెట్టడానికి తామే సౌకర్యాలు కల్పించాల్సి వస్తోంది.
ఎమ్మెల్యేల పనితీరుపై తప్పుడు నివేదికలిస్తున్నారని ఆరోపణలు
ఇప్పుటికే ఎమ్మెల్యేల స్థాయిలో ఐ ప్యాక్ తీరుపై పార్టీలో అసంతృప్తి ఉంది. రాజకీయాల గురించి ఏమీ తెలియని వారిని తీసుకొచ్చి.. తమపై కూర్చోబెట్టి తమ పని తీరును వారితో సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారని.. ఇంత కన్నా అవమానం ఉండదని ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజకీయం ఎలా చేయాలో కూడా వారే చెబుతున్నారు. అంత మాత్రం దానికి తామెందుకన్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఉంది. ఈ అధికారంతో కొన్ని చోట్ల ఐ ప్యాక్ సభ్యులు పార్టీ నేతల వద్ద డబ్బులు దండుకుంటున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి . సగం మందికిపైగా ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడం లేదని.. కానీ 18 మంది పేర్లే చెప్పడం వెనుక ఏదో జరిగిందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తోంది.
ఐ ప్యాక్ ఏది చెబితే అదే జగన్ రెడ్డి మాట !
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఐ ప్యాక్ మీద ఆధారపడుతున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐ ప్యాక్ చెప్పిందానికి.. జరిగిన దానికి చాలా తేడా ఉన్నా… ఆయనకు ఐ ప్యాక్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. వారు చెప్పినట్లే చేస్తున్నారు. దీంతో జగనే ఏమీ చేయలేక ఐ ప్యాక్ చెప్పింది చేస్తూంటే.. కింది స్థాయి వారు సొంత రాజకీయాలు ఎలా చేస్తారని.. సెటైర్లు వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ గుప్పిట్లో చిక్కుకున్న వైసీపీ విలవిలలాడుతోందని ఇతర పార్టీల నేతలంటున్నారు.