రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు మొదటిరోజున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేస్తుంటే అన్ని గేట్లను మూసేసి దర్శకుడు బోయపాటి శ్రీను చేత షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తున్నందునే బయట త్రొక్కిసలాట జరిగి 27మంది మరణించారని కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఆరోపించాయనే కంటే చంద్రబాబుని అప్రతిష్ట పాలుచేసేందుకే పనిగట్టుకొని ప్రచారం చేశాయని చెప్పవచ్చును. వారి ఆరోపణలను దర్శకుడు బోయపాటి శ్రీను ఖండించారు. తను పుష్కరాల ముందురోజు సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమాన్ని చిత్రీకరించిన తరువాత వెళ్ళిపోయానని, త్రొక్కిసలాట జరిగిన రోజున తానసలు రాజమండ్రిలోనే లేనని ఆయన మీడియాకి తెలిపారు. ఈరోజు పుష్కరాల ముగింపు వేడుకలని కూడా తను చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైటింగ్, కెమెరా, సౌండ్ వంటి సాంకేతిక అంశాలకే పరిమితమని, గోదావరి హారతి కార్యక్రమాన్ని, ముగింపు వేడుకలని మరింత అందంగా, ప్రజలను ఆకట్టుకొనే విధంగా తీయాలనుకొంటున్నట్లు బోయపాటి శ్రీను తెలిపారు.