వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ల కసరత్తు అంశం అటూ ఇటూ సాగుతోంది. మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను తప్పించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి రెండు, మూడు సార్లు పిలిచినా రాలేదు. తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించారు. అయితే హఠాత్తుగా గురువారం ఆయన క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. మాట్లాడి నియోజకవర్గానికి వెళ్లారు.
తాను మళ్లీ మైలవరం నుంచే పోటీ చేస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశానుసారం నడుచుకుంటానని చెబుతున్నారు. తనను మైలవరంలోనే పని చేసుకోవాలని చెప్పారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని…మైలవరం సీటుపై ఎటువంటి అపోహలు లేవు అని వసంత చెబుతున్నారు. తర్వాత మైలవరంలో అభ్యర్థిని మార్చడం లేదన్న లీకులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయి.
మైలవరం నుంచి అభ్యర్థిని మార్చి మంత్రి జోగి రమేష్ కు చాన్సిచ్చారన్న ప్రచారం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ ను జగ్గయ్యపేట నుంచి పోటీ చేయామని సూచించారని అంటున్నారు. దానికి ఆయన అంగీకరించలేదు. చివరికి మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కే టిక్కెట్ కేటాయించారని చెబుతున్నారు. మొత్తంగా వైసీపీలో టిక్కెట్ల పంచాయతీ క్రమంగా వేడెక్కుతోంది.