తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణకి తెరాస బంపర్ ఆఫర్ ఇచ్చిందని, కనుక ఆయన త్వరలో పార్టీ వీడి తెరాసలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలని ఆయన ఖండించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, “నేను తెరాసలో చేరుతున్నాననే వార్తలలో నిజం కాదు. రాజకీయ దురుదేశంతోనే గిట్టనివారు కొందరు ఈ విధంగా నాగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పటికీ తెదేపాలోనే ఉంటాను. పార్టీని వీడే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు.
ఆయన ఆవిధంగా చెప్పడం చాలా మెచ్చుకోవలసిన విషయమే. కానీ తెలంగాణాలో కెసిఆర్ ఉన్నంత కాలం తెరాసని డ్డీకొని తెదేపా అధికారంలోకి రాలేదని, కనుక వచ్చే తాను ఎన్నికలలో పోటీ చేయదలచుకోలేదని ఆయన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పి, తనకి రాజ్యసభ సీటు లేదా కేంద్రంలో ఏదయినా నామినేటడ్ పదవి ఇప్పించవలసిందిగా కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కనుక రమణకి వాటి గురించి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన మీడియా సమావేశంలో వాటి ప్రస్తావన చేయకపోవడం గమనిస్తే, ఆ వార్తలలో ఎంతో కొంత నిజం ఉందనే భావించవలసి ఉంటుంది. కనుక ఆయన తెదేపాలోనే కొనసాగినప్పటికీ, అస్త్రసన్యాసం చేసినట్లే భావించవచ్చు.
ఆయన స్థానాన్ని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలనుకొన్నా ఆయన కూడా పార్టీ వీడి స్వంత కుంపటి పెట్టుకొబోతున్నట్లు ఈ మధ్యనే మీడియాలో వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వాటిని ఇంకా ఖండించలేదు. కనుక ఆయన పార్టీలో కొనసాగితే పరువాలేదు. కానీ ఆయన కూడా విడిచిపెట్టే మాటయితే, తెలంగాణాలో తెదేపాకి నేత్రుత్వం వహించి తెరాసని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని ధీటుగా ఎదుర్కోగల నాయకుడి కోసం కాగడా పట్టుకొని వెతుక్కోవలసి రావచ్చు.