వైసీపీ నేతల రాజకీయంతో నేరుగా తలపడాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా బలవంతంగా పదవి కోల్పోయిన రమేష్‌కుమార్ నిర్ణయించుకున్నారు. ఎస్ఈసీగా ఉన్నప్పుడు.. తాను రాసిన లేఖపై విజయసాయిరెడ్డి కొత్త రాజకీయం ప్రారంభించినట్లుగా సూచనలు రాగానే.. వెంటనే రెస్పాండ్ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశానని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై థర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తాను రాసిన లేఖ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ధృవీకరించారని.. హోంశాఖకు సమాచారం తన పరిధిలోని అంశం..దీనిపై వివాదం అనవసరమని తేల్చేశారు.
ఎస్ఈసీగా ఉన్నప్పుడు రమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై విచారణ జరిపించాలంటూ.. విజయసాయిరెడ్డి డీజీపీకి ఓ లేఖ రాశారు. దాని ప్రకారం.. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా చేసిన సంతకానికి.. హోంశాఖకు రాసిన లేఖలో సంతకానికి మధ్య తేడా ఉందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. లేఖను కనకమేడల, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ సృష్టించారని.. లేఖలో ఆరోపించారు. మాజీ ఎస్ఈసీకి, ముగ్గురు టీడీపీ నేతల పేర్లను కలపడంపై… రాజకీయ కుట్ర ఉందని.. ఎస్ఈసీ తొలగింపు అంశంపై కోర్టు విచారణలో టీడీపీతో కలిసి ఆయన లేఖ రాశారనే విషయాన్ని వాదించడానికి ఈ కొత్త ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
నిజానికి ఈ విషయంలో విజయసాయిరెడ్డి ధర్డ్ పర్సన్. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా..సంతకం ఫోర్జరీ అయితే.. రమష్ కుమార్ ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఆ ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. తనకే మాత్రం సంబంధం లేకపోయినా… ముగ్గురు టీడీపీ నేతల్ని కలిపేసి.. రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని ఆరోపిస్తూ.. విచారణ చేయాలని లేఖ రాశారు. దీని వెనుక గూడుపఠాణి ఉందని అనుమానిస్తున్న టీడీపీ నేతలు విజయసాయిరెడ్డిపై కోర్టుకెళ్తామని ప్రకటించారు.