ఈరోజు దేశవ్యాప్తంగా గణ తంత్ర వేడుకలు మొదలయిన కొద్ది సమయానికే ఉదయం సుమారు 10.30-11.00 గంటలకు రాజస్థాన్ రాజధాని జైపూర్ కి సుమారు 500కిమీ దూరంలో గల బర్మర్ పట్టణం సమీపంలో ఒక బెలూన్ వంటి పరికరం గాలిలో ఎగురుతుండటాన్నిభారత్ వాయుసేనకి చెందిన రాడార్ గుర్తించడంతో, వెంటనే సుఖోయ్-30ఎం.కి.ఐ. యుద్ధవిమానాన్ని పంపి దానిని కూల్చి వేశారు. ఐసిస్ ఉగ్రవాదులు లేదా పాక్ ఉగ్రవాదులు ఈరోజు డిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో బారీ విద్వంసం సృష్టిస్తారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు భద్రతా దళాలు, నౌక, వాయు సేనలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. స్థానిక పోలీసులు, వాయుసేనకి చెందిన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని కూల్చివేసిన ఆ వస్తువు శిధిలాలను సేకరించారు. బహుశః అది వాతావరణ శాఖకి చెందిన పరికరమేమోనని అనుమానిస్తున్నారు. ఏమయినప్పటికీ ఇది వాయుసేన అప్రమత్తతకి అద్దం పట్టిందని చెప్పవచ్చును.