జీతాలు మహా ప్రభో అని సగం మందికిపైగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఉద్యోగులు అంతా వచ్చి తమపై దాడి చేస్తారేమోనని ఉద్యోగ సంఘ నేతలు మేము తల్చుకుంటే ప్రభుత్వాన్ని నిలేస్తాం.. కూల్చేస్తామనే ప్రకటనలు చేస్తూ .. వీడియోలు లీక్‌లు చేసుకుంటూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు ఉద్యోగులు కాదు.. సగం మంది సివిల్ సర్వీస్ అధికారులకూ జీతాలు రాలేదట . ఈ విషయం ఆ సర్వీస్ అధికారులు గగ్గోలు పెడుతూంటే బయటకు వచ్చింది.
కేంద్రం నుంచి రావాల్సిన రూ. వెయ్యి కోట్ల నిధులు రాలేదు. ఎందుకంటే పాత బాకీలున్నాయి.. జమ చేసుకున్నామని ఆర్బీఐ నుంచి సమాధానం వచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన జీతాల బిల్లు పెండింగ్‌లో ఉన్నది రెండున్నర వేల కోట్లని చెబుతున్నారు. ఆ వెయ్యి కోట్లిస్తే ఎలాగోలా సర్దుబాటు చేయాలనుకున్నారు. కానీ రాకపోయే సరికి మొదటికే మోసం వచ్చింది. సివిల్ సర్వీస్ అధికారలూ జీతాల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రతీ నెలా మంగళవారం అప్పులు తీసుకోవడం.. జీతాలివ్వడం అనే ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు అప్పులు దక్కడం లేదు. ఏడాది మొత్తం చేయాల్సిన అప్పును ఆరు నెలల్లో చేసేశారు. ఆ సంస్కరణలు.. ఈ సంస్కరణలు అని చెప్పి.. ఉన్న అప్పు మొత్తం లాగేశారు. ఈ నెల మొదట్లో ఆర్బీఐనుంచి కొంత… ఏరో కార్పొరేషన్ పేరుతో మరో బ్యాంక్ నుంచి రెండు వేల కోట్లు తెచ్చి సామాజిక పెన్షన్లు.. ఇతర పథకాలకు సరి పెట్టారు. ఇప్పుడు జీతాలకు మాత్రం రోజువారీ ఆదాయంపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. పదిహేనో తేదీ వరకూ అందరికీ జీతాలు ఇస్తూ పోతారని చెబుతున్నారు.
కేంద్రం కొత్త అప్పులకు పర్మిషన్ ఇవ్వకపోతే.. బ్యాంకులు ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వకపోతే.. ఏపీ పరిస్థితి వచ్చే మార్చి వరకూ దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత కొత్త అప్పులకు పర్మిషన్ వస్తుంది కాబట్టి.. నాలుగైదు నెలలు జల్సా చేస్తారు.