వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్లిన అటెండర్లను సీఎస్ జవహర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు వద్ద పికప్ చేసుకుని తనతో పాటు తిరుపతి తీసుకెళ్లి అక్కడి నుంచి విమానంలో తాడేపల్లికి తీసుకెళ్లిన అంశంపై ఇప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది. ప్రముఖ పత్రికల్లో వచ్చిన ఆ వార్తలు అవాస్తవమని వారం రోజుల తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ వార్తలు పరువు తక్కువగా ఉన్నాయన్నారు. సీఎస్‌పై దుష్ప్రచారం చేయాలనే దురుద్దేశంతో ఊహాజనితమైనని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
జవహర్ రెడ్డి సీనియర్ అధికారి అని.. ఆయన తన కెరీర్ మొత్తంలో బాధ్యతాయుతమైన స్థానాలను నిర్వహించారని..సీఎస్ పోస్టుకు చాలా గౌరవం ఉంటుందని.. ఆయన గౌరవాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి వార్తలని ఐఏఎస్ అధికారుల సంఘం చెప్పుకొచ్చింది. అయితే ఈ వాదన వినిపించడానికి ఏ ఐఏఎస్ అధికారుల సంఘం నేతలూ తెర ముందుకు రాలేదు. ఓ ప్రెస్ నోట్ అని విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ కూడా.. ఎలాంటి లెటర్ ప్యాడ్ మీద లేదు. ఐఏఎస్ అధికారుల సంఘానికి ఓ లెటర్ ప్యాడ్ అయినా ఉంటుంది.. కానీ తెల్ల పేపర్ మీద విడుదల చేశారు.
జవహర్ రెడ్డి పికప్ సర్వీస్ చేశారన్న విమర్శలు మూడో తేదీన వచ్చాయి. వారం రోజుల తర్వాత ఎందుకు స్పందించారు అదీ కూడా అధికారికంగా కాకండా.. అనధికారికంగా ఎందుకు స్పంచారు అన్నది సస్పెన్స్ గా మారింది. సీఎస్ .. హత్య కేసులో విచారణకు హాజరైన వారిని ఇలా దగ్గరుండి తీసుకెళ్లారని డీవోపీటీకి ఫిర్యాదులు వెళ్లాయని.. ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించిందని అందుకే ఇలాంటి ఖండనలు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అది అబద్దం అయితే.. ఈ పాటికి .. మీడియా సంస్థలపై ఎలా దాడి చేసేవారో గతంలో చాలా ఘటనల్లో నిరూపితమయిందని కొంత మంది చెబుతున్నారు.