ఏపీ క్యాడర్ కేటాయించినా తెలంగాణలో పని చేస్తున్న ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు.. తెలంగాణ కేటాయించిన ఏపీలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు పదహారో తేదీలోపు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ వారెవరికి స్థానాలు మారడం ఇష్టం లేదు. అందుకే అత్యున్నత స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తమను ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా కీలక స్థానంలో అమ్రపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఐపీఎస్ అంజనీకుమార్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆలాగే కృష్ణజిల్లా కలెక్టర్ సృజన తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తిగా లేరు. అందరూ .. తమ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయడానికి సమయం తక్కువగా ఉంది. పదహారో తేదీలోపు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకే న్యాయపోరాటం కూడా చేయాలనుకుంటున్నారు.
కానీ సోమేష్ కుమార్ విషయంలో ఇప్పటికే కోర్టు స్పష్టమైన తీర్పు వచ్చింది. మిగిలిన వారికి భిన్నంగా తీర్పులు వచ్చే అవకాశం లేదు. అయితే తమ స్థానికత విషయంలో వారు కొత్త వాదనలు వినిపించే అవకాశం ఉంది. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన అడ్రస్ ఆధారంగా స్థానికత ఖరారు చేశారని.. కానీ తమ అసలు నేటివ్ తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలేనని వారు వాదించే అవకాశం ఉంది. మెత్తంగా ఆ ఐపీఎస్, ఆ ఐఎఎస్‌లకు కదలడం ఇష్టం లేదు. మరి వారి పవర్ పని చేస్తుందా ?