గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న IAS కాట అమ్రపాలికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెకు మరో గత్యంతరం లేకుండా పోయింది.
2010కి బ్యాచ్‌కు చెందిన కాట అమ్రపాలిని రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏపీకి కేటాయించింది. ఇలా కేటాయింపుల కోసం ఖండేకర్ కమిటీ సిఫారసులు చేసింది. ఆ కమిటీ సిఫారసుల ప్రకారం ఏపీ స్థానికత ఉన్న వారందరికీ ఏపీ క్యాడర్ కేటాయించారు. ఈ క్రమంలో అమ్రపాలిని కూడా ఏపీకి కేటాయించారు. కానీ తనది తెలంగాణ స్థానికత గా గుర్తించి తెలంగాణకే కేటాయించాలని అమ్రపాలి క్యాట్ తో పాటు కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. అయితే సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారులే ఫైనల్ అని కేంద్రం తేల్చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో అమ్రపాలి తన స్థిరనివాసంగా విశాఖను పేర్కొన్నారు. ఈ కారణంగా ఆమెను ఏపీకే కేటాయించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాకు కలెక్టర్ గా చేసిన అమ్రపాలి తర్వాత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఓఎస్డీగా.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు రేవంత్ సర్కార్ లో ఆమెకు కీలక పోస్టులు దక్కాయి. అయితే ఇప్పుడు ఏపీకి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు కేటాయించిన క్యాడర్లో కాకుండా తెలంగాణలో కొనసాగుతున్న సివిల్ సర్వీస్ అధికారులందరికీ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.