గ్రేటర్లో అనుకూల ఫలితాలు రాకపోవడంతో.. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ తిరిగి వచ్చిన తర్వాత ఒక్క సారే యాభై వేల ఉద్యోగాల భర్తీ అనే ప్రకటన చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దని.. అంతకు ముందే అసెంబ్లీ వేదికగా చెప్పిన కేసీఆర్ హఠాత్తుగా యాభై వేల ఉద్యోగాల భర్తీ అని చెప్పే సరికి చాల మంది నమ్మలేదు. కానీ కాస్త ఆశలు మాత్రం పెట్టుకున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అలాగే.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం జిమ్మిక్కని విపక్షాలు విమర్శించాయి. దానికి తగ్గట్లుగానే ఎన్నికలు అయిపోయాయి.. టీఆర్ఎస్ విజయం సాధించింది కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం కనీసం నోటిఫికేషన్ల వరకూ రాలేదు. త్వరలో త్వరలో అంటూ కాలక్షేపం చేస్తున్నారు.
అదే సమయంలో… టీఎస్పీఎస్సీ సభ్యులందరూ.. ఒకరిద్దరు మినహా రిటైరైపోయారు. వారి స్థానాలనూ భర్తీ చేయలేదు. దీనిపైనా విమర్శలు వస్తూండటంతో ఇప్పుడు.. టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేశారు. ఇవన్నీ రాజకీయ పదవుల్లాంటివి. టీఆర్ఎస్ మద్దతుదారులకు పదవులు వచ్చినట్లయింది. మరి నిరుద్యోగుల సంగతేమిటన్నప్రశ్న ఉదయిస్తోంది. ఉద్యోగాలను భర్తీ చేయకపోతే.. నిరుద్యోగులు ఈసారి తీవ్ర ఆగ్రహానికి గురవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు ఉద్యోగుల వయో పరిమితిని కేసీఆర్ పెంచారు. ఈ కారణంగా…రిటైరయ్యే ఉద్యోగులు వచ్చే రెండేళ్ల పాటు ఉండరు. ఈ కారణంగా భర్తీ చేయకపోయినా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం.. ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
దీంతో.. కేసీఆర్ అసలు ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తారా లేక… గతంలో ఇచ్చిన ఎన్నో హామీల్లాగానే.. యాభై వేల ఉద్యోగాల భర్తీ కూడా… అలా అలా.. సాగదీసుకుంటూ పోతారా అన్నది ఇప్పుడు నిరుద్యోగుల్లో ఉన్న సందేహం. వారు మాత్రం.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని వేల రూపాయలు ఖర్చు పెట్టి.. కోచింగ్ మెటీరియల్స్ కొనుక్కుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.