తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినందుకే… చీఫ్ సెక్రటరీని అత్యంత అవమానకరంగా బదిలీ చేయడానికి.. తన పలుకుబడినంతా ఉపయోగించి సక్సెస్ అయిన సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. మరో సర్క్యూలర్ జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్.. సాధారణ పరిపాలనశాఖకు కూడా ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. తన శాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు.. రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో.. ఆర్థిఖ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఆయన ఓ లేఖ రాశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ.. జీతాలు ఇచ్చిన తర్వాతే తనకు జీతం ఇవ్వాలని.. ఆ లేఖ సారాంశం. దీంతో.. ఇతర శాఖల ఉన్నతాధికారులు.. ఆర్థిక శాఖ అధికారులు.. తలు పట్టుకుంటున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు అందుబాటులో ఉంటే.. అప్పుడిస్తున్నారు. కొన్ని శాఖల్లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. సహజంగానే ఆర్థిక శాఖపై దీనికి సంబంధించి ఒత్తిడి ఉంటుంది. తన శాఖ ఉద్యోగులు… తమ జీతాల విషయంపై ఒత్తిడి చేస్తూండటంతో.. ప్రవీణ్ ప్రకాష్.. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడానికో… లేక తన పలుకుబడి కారణంగా.. లేఖ రాస్తే.. జీతాలు ఇస్తారని అనుకున్నారో కానీ.. తన శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారందరికీ ఇచ్చిన తర్వాతనే తనకు జీతాలివ్వాలని.. ఆదేశించారు. దాంతో.. ఇతర శాఖల్లోనూ.. ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ జీతాల సంగతేంటని అడిగేవారు ఎక్కువైపోయారు.
నిజానికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే.. అన్ని డిపార్టుమెంట్లలోనూ కీలకంగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శుల దగ్గర పని చేసేవారిలో కూడా సగానికిపైగా.. ఈ తరహా ఉద్యోగులే ఉన్నారు. వారందరికీ జీతాలు రాకపోవడం..సహజంగానే ఉన్నతాధికారులపై ఒత్తిడికి కారణం అవుతోంది. అదే సమయంలో.. ఆర్థిక శాఖ మాత్రం… నిధులు ఉన్నప్పుడు సర్దుబాటు చేస్తున్నామని… లేకపోతే ఎక్కడ్నుంచి తెచ్చివ్వగలమన్న సమాధానం పంపుతోంది. ఇవన్నీ ప్రవీణ్ ప్రకాష్‌కు తెలియనివి కాదని..కానీ ఆయన తనను మాత్రమే సిన్సియర్‌గా ప్రకటించుకుని మిగతా వారిని మరో రకంగా చూపించే ప్రయత్నమేనన్న చర్చ సెక్రటేరియట్లో సాగుతోంది.