తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పదవీకాలం మరో ఏడాది ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మురళీ వీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పని లేని పోస్టు ఇచ్చి అవమానించారని మురళీ ఆవేదన చెందుతున్నారు. కొన్ని వర్గాల ఐఏఎస్‌లకు ప్రాధాన్య పోస్టులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఐపీఎస్ అధికారి వీకే సింగ్ కూడా.. ఇదే తరహా అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదవిని వదిలేస్తానని ప్రకటించారు. జైళ్ల శాఖ డీజీగా ఉన్న ఆయనను…సెలవుల్లో ఉన్నప్పుడు.. బదిలీ చేసి.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. దీంతో ఆయన కూడా.. అసహనానికి గురయ్యారు. వివక్షకు గురవుతున్నామని పని లేకుండా ఉంచారని.. ఆయన అసంతృప్తితో… పదవికి రాజీనామా చేస్తానన్నట్లుగా మాట్లాడారు.
నిజానికి ఆకునూరి మురళీ ముందు నుంచీ… దళిత వర్గ అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కలేదన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముందు కూడా… ఇలా ప్రాధాన్యత దక్కని అధికారులతో.. సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐఏఎస్ అధికారులతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇరవై మంది అధికారులు ఈ గ్రూప్‌లో ఉన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఏర్పాటుకు అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశారు. తమకు గుమస్తాల్లాంటి పోస్టులు ఇచ్చి రిటైర్ అయిన వాళ్లను కూడా తీసుకొచ్చి ప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారన్న అసహనం.. తెలంగాణ బలహీన వర్గాల ఐఏఎస్ అధికారుల్లో ఉంది. గతంలో వెంకట్రామిరెడ్డి అనే రిటైర్డ్ అధికారికి ఏడు శాఖల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. 12 ఏళ్ల కిత్రం పదవీ విరమణ చేసిన వెలమ అధికారి గోపాలరావుకు ఎస్పీడీసీఎల్ సీఎండీగా పదవి ఇచ్చారు. ఇవన్నీ దళిత అధికారుల్లో అసంతృప్తికి కారణం అయింది.
ఎన్నికల సమయంలో.. వీరంతా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారన్న ప్రచారం కూడా ఉద్ధృతంగా సాగింది. దాంతో.. సహజంగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్య పోస్టులు దక్కలేదు. గతంలో కలెక్టర్ ఉన్న ఆకునూరి మురళీకి చివరికి… పని లేని శాఖను కేటాయించారు. దాంతో.. ఆయన.. ఇప్పుడు.. రాజీనామాకు సిద్ధమయ్యారు. మరికొంత మంది.. తమ అసంతృప్తిని తెలియచేసే అవకాశాలున్నాయి. తెలంగాణ సర్కార్ లో కొన్ని వర్గాల వారికే ప్రాధాన్యం లభిస్తోందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అవి ఇప్పుడు బయటపడతాయన్న ప్రచారమూ జరుగుతోంది.