దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలోనూ కోర్టులతో చీవాట్లు తిని.. శిక్షలు వేయించుకునే పరిస్థితి లేదు. న్యాయవ్యవస్థను లైట్ తీసుకుని పట్టించుకోకుండా .. రాజ్యాంగాన్ని పాటించకుండా జీవోలు ఇచ్చి అమలు చేసుకోవచ్చన్న పాలనను కొనసాగిస్తున్న ఐఏఎస్ అధికారులు దేశంలోఇతర రాష్ట్రాల్లో కనిపించరు. ప్రతీ రోజూ హైకోర్టులో ఉన్నతాధికారులు కనిపించని సందర్భమే ఉండదు. వారు ఎంత చట్ట వ్యతిరేక పాలన చేస్తున్నారో ఇదే సాక్ష్యం. ఈ పరిస్థితి ఇప్పుడు కాదు గత మూడేళ్ల నుంచి ఉంది. అయినా ఒక్కరంటే ఒక్క ఐఏఎస్ అధికారిలోనూ మార్పు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది ?
రాజ్యాంగం గురించి ఏపీ ఐఏఎస్‌లకు కొత్తగా చెప్పాలా?
ఐఏఎస్‌లు అంటే అత్యున్నత స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు. రాజ్యాంగం పట్ల స్పష్టమైన అవగాహనతో విధులు నిర్వహించేవారు. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం… ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి ఎన్ని ఎజెండాలు ఉన్నా.. అధికారులు మాత్రం రాజ్యాంగపరంగానే నిర్ణయాలు తీసుకోవాలి. అమలు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే…చేయడం సాధ్యం కాదని నిర్మోహమాటంగా చెప్పాలి. అయినా చేయమని ఒత్తిడి తెస్తే … చేసేస్తే బలయ్యేది తామేనని ఐఎఎస్‌లకు తెలీదా ? కార్యనిర్వహక వ్యవస్థలో అధికారులే జవాబుదారీ అని తెలిసినప్పటికీ ఎందుకు రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రోత్సహించినా… ఎందుకు ముందడుగు వేస్తున్నారన్నది ఇక్కడ కీలకమైన అంశం. ప్రభుత్వానికి భయపడటమా.. విధేయత చూపడమో కానీ మొత్తానికి వారు తాము చేసిన ప్రమాణాలు.. చదువుకున్న చదువులకు భిన్నంగా విధులు నిర్వహిస్తున్నారు. కోర్టుల్లో నిందల పాలవుతున్నారు.
రాజకీయ నేతలు ఒత్తిడి చేసినా.. ఇరుక్కుపోయేది తామేనని తెలియదా ?
సివిల్ సర్వీస్ అధికారులు అంటే.. ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేది. కానీ రాజకీయ నేతల మాటలు విని.. ప్రాధాన్యమైన పోస్టింగ్‌ల కోసం ఏం చేసేందుకైనా వెనుకాడని తీరు వల్ల ప్రజల్లో చులకన అవుతున్నారు. నిజానికి దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఏపీలోనే ఎందుకు ఉందని అధికారులు ఆలోచించరా ?. ఇతర చోట్ల కూడా ఇలాంటివి ఉన్నా… చాలా పరిమితంగానే. అక్కడి అధికారులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికికాస్త సిగ్గుపడతారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఏపీ నుంచి వచ్చిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని చేర్చుకోవడానికి అక్కడి సీఎస్ నిరాకరించారు. దానిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తక్షణం చేర్చుకున్నారు. కోర్టుల్ని గౌరవించారు. కానీ ఇలాంటి గౌరవం ఎందుకు రాజ్యాంగానికి ఏపీ ఐఏఎస్‌లు ఇవ్వడం లేదు.
జీతంగా ప్రజాధనం.. చేసేది రాజ్యాంగ ఉల్లంఘనల సేవనా ?
ఐదేళ్లకో సారి మారే పాలకులు భిన్న మనస్థత్వాలతో ఉంటారు. ఒకరు బాధ్యతతో ఉండొచ్చు.. మరొకరు కుట్రపూరితంగా ఉండొచ్చు. మరొకరు సొంత ప్రయోజనాలకోసమే పని చేయవచ్చు. ఏం చేసినా ఐఏఎస్‌ల ద్వారానే బండి నడిపించుకోవాలి. వారే … వారి ఆలోచనలకు తగ్గట్లుగా వ్యవహరించడం ప్రారంభిస్తే అంతిమంగా జరిగేది ప్రజలకు నష్టమే. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. అయ్యా…ఎస్‌ల దెబ్బకు రాష్ట్రం పరువు పోతోంది. ఇప్పటికే వారి తీరు వల్ల విభజిత రాష్ట్రం కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. ఇప్పటికైనా వారు రాజ్యాంగ పాలనకు ప్రయత్నిస్తే.. ప్రజాధనం జీతంగా తీసుకుంటున్నందున కొంతైనా న్యాయం చేసినట్లు అవుతుంది.