ఇద్దరు మహిళా సివిల్ సర్వీస్ అధికారులు తమ వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టుకుని రచ్చ చేసుకుంటే.. సంచలనం కాకుండా ఉంటుందా ? కర్ణాటక మీడియాకు ఇప్పుడు ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూపా ముద్గల మధ్య వివాదం పండగలా మారింది. ఐపీఎస్ రూపా ముద్గల్.. రోహిణి సింధూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వివాదం ఒక్క సారిగా హాట్ టాపిక్ అవుతోంది.
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి వ్యవహారం కర్ణాటకలో చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. మొదట్లో చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్నట్లుగా పేరు తెచ్చుకున్న ఆమె తీరు తర్వాత వివాదాస్పమయింది. తాజాగా అదే రాష్ట్రంలో మరో కీలక పోస్టులో ఉన్న ఐపీఎస్ రూపాముద్గల్ కీలక ఆరోపణలు చేశారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐఏఎస్ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. కోవిడ్ టైంలో మైసూర్ కలెక్టర్ గా ఉన్న రోహిణి.. విలాసవంతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఏకకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితాను విడుదల చేశారు.
రోహిణి సింధూరి మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్‌తో వివాదం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆమె తీరు కర్ణాటక అధికార వర్గాల్లో ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంది. ఆ మధ్య ఓ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 021 తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’ అన్నారు.