ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఒక్క రోజు కూడా ఉద్యోగం చేయలేకపోయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి.. ఎట్టకేలకు ఏపీలో విధులు నిర్వహించాలనే తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఏపీ సర్వీసులో చేరారు. ఇందు కోసం ఆమె తన తెలంగాణ క్యాడర్‌ను త్యాగం చేసేసి.. ఏపీ క్యాడర్లో చేరారు. అత్యున్నత స్థాయి ప్రయత్నాలు చేసి.. చేసి.. చివరికి ఇరవై నెలలకు సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద నుంచి తీసుకు రావాలని ఎన్నికల పలితాలు రాగానే మొదటి సారి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయినప్పుడే ప్రయత్నించారు. దానికి కేసీఆర్ కూడా అంగీకరించారు. కానీ.. ఢిల్లీలో మాత్రం పీట ముడి పడిపోయింది. విజయసాయిరెడ్డి.. తాను ఢిల్లీలో ఉన్నంత కాలం శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పట్లోనే ఆమె తెలంగాణలో ఉద్యోగానికి సెలవు పెట్టి ఢిల్లీలోనే ఉండటం ప్రారంభించారు. ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతోనూ.. ప్రధానితోనూ జరిగిన భేటీల్లో కూడా శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కానీ ఆమెను తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి పంపే చాన్స్ మాత్రం సాధించలేకపోయారు.
శ్రీలక్ష్మితో పాటు స్టీఫెన్ రవీంద్ర అనే మరో ఐపీఎస్‌ను కూడా.. సీఎం జగన్ ఏపీకి డిప్యూటేషన్ మీద తీసుకు రావాలని ప్రయత్నించారు. కొంత కాలం ఇబ్బందులు ఎదురయినప్పటికీ.. తర్వాత ఆమోదం లభించింది. కానీ స్టీఫెన్ మాత్రం ఏపీకి రావడానికి నిరాకరించారు. శ్రీలక్ష్మి మాత్రం ఇక ఐఏఎస్ ఉద్యోగం చేస్తే ఏపీలోనే చేయాలన్నట్లుగా ప్రయత్నాలు చేసింది. చివరికి క్యాడర్ మార్చుకునేందుకు క్యాట్‌ను ఆశ్రయించింది. తనది ఏపీ అని.. క్యాట్‌లో పిటిషన్ వేసి.. తనకు తన సొంత రాష్ట్రాన్ని కేటాయించాల్సిందేనని.. వాదించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెకు తెలంగాణ కేటాయించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం.. ఆమెకు తన సొంత రాష్ట్రం ఏపీ అనే సంగతి గుర్తు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె క్యాడర్ మార్చుకునేందుకు సొంత రాష్ట్రం సెంటిమెంట్ ను వాడుకున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని తీవ్రంగా కెరీర్ నష్టపోయిన ఐఎఎస్‌లలో శ్రీలక్ష్మి ఒకరు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన ఆమె… కేసుల్లో ఇరుక్కోకపోతే.. చీఫ్ సెక్రటరీగా అత్యధిక కాలం పని చేసే అధికారిగా రికార్డు సృష్టించేవారు. కేసుల్లో ఇరుక్కోవడంతో పదోన్నతులు ఆగిపోయాయి. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డి ఆమెకు.. అత్యంత కీలకమైన పదవి ఇస్తారని అంచనా వేస్తున్నారు సీఎంవోలో చక్రం తిప్పే అవకాశం ఆమెకే లభించవచ్చని భావిస్తున్నారు. శ్రీలక్ష్మి రాకతో.. ఏపీ అధికార వర్గాల్లో సమీకరణాలు మారనున్నాయి.