రేటింగ్: 2.25/5
చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం వేరు
చేయని తప్పు.. మీద పడడం వేరు.
అలా చేయని తప్పు వెంటపడుతుంటే – తన జీవితాన్ని ఉరుకులు పరుగులుగా మార్చుకున్న ఓ కుర్రాడి కథ.. `ఇచట వాహనములు నిలపరాదు`. అనుకున్న థీమ్ బాగుంది. టైటిల్ అదిరిపోయింది. మరి.. ఆ టైటిల్ కీ, థీమ్ కి తగిన న్యాయం దర్శకుడు చేశాడా? లేదా? వాహనము నిలపరాదు.. అన్నచోట బండి ఆపితే ఏం జరిగింది? ఎన్ని అనర్థాలు ఎదురయ్యాయి?
అరుణ్ (సుశాంత్)కి అమ్మంటే ప్రాణం. స్నేహితుడు పులి (ప్రియదర్శి) అంటే ఇష్టం. తన ఆఫీసులో కొత్తగా చేరిన మీనూ (మీనాక్షి చౌదరి)ని ప్రేమిస్తాడు. తను కూడా అరుణ్ ని ఇష్టపడుతుంది. ఓరోజు.. మీనూని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు అరుణ్. ఆమె స్నేహపురి కాలనీలో ఉంటుంది. స్నేహపురి కాలనీలో దొంగల భయం ఎక్కువ. అందుకే అక్కడ టైట్ సెక్యురీటీ. ఆ కాలనీలోకి ఎవరు కొత్తగా వచ్చినా అనుమానంగా చూస్తారు. అలాంటి చోట… ప్రియురాలి కోసం వెళ్తాడు అరుణ్. కాకపోతే.. ఓ ఇంట్లోకి వెళ్లబోయి, మరో ఇంటికి వెళ్తాడు. దాంతో.. అరుణ్ జాతకం తిరగబడిపోతుంది. ఆ కాలనీ మొత్తం అరుణ్ ని చంపడానికి వెంబడిస్తారు. పులిని పోలీసులు అరెస్టు చేస్తారు. అరుణ్ అమ్మ… ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటుంది. ఈ అనర్థాలు జరగడానికి కారణం ఏమిటి? అసలు అరుణ్ చేసిన తప్పేమిటి? దీని వెనుక ఎవరున్నారు? అనేదే మిగిలిన కథ.
ఓ చిన్న పొరపాటు వల్ల ఓ యువకుడి జీవితంలో జరిగిన అల్లకల్లోలం ఈ కథ. కాన్సెప్ట్ వరకూ బాగుంది. బాగా తీయొచ్చు కూడా. కానీ దర్శకుడు ఇక్కడే తడబడ్డాడు. తాను అనుకున్న పాయింట్ ని.. జనరంజకంగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీయలేకపోయాడు. హీరో కాలనీలోకి ఎంటర్ అయి, అక్కడ ఇరుక్కుపోవడం కోర్ పాయింట్. అక్కడి వరకూ కథని నడిపించాలంటే కొన్ని సన్నివేశాలు కావాలి. అక్కడే పూర్తిగా ఇబ్బంది పడ్డాడు. సుశాంత్ ఇంట్రడక్షన్, తన ఫ్లాష్ బ్యాక్, లవ్ స్టోరీ… ఇవన్నీ సాగదీత వ్యవహారాలు. విసుగు తెప్పించిన విషయాలు. `వీడంతే ఒక్క ముక్కలో చెప్పేదాన్ని సాగదీస్తాడు` అంటూ.. హీరో గురించి ఓ సైడ్ క్యారెక్టర్ ఓ డైలాగ్ విసురుతుంది. ఈ కథ సాగిన విధానం కూడా అలానే ఉంటుంది. ముక్కలో తేలిపోయే మ్యాటర్ ని మూడు సీన్ల వరకూ లాగారు. దాంతో… అసలు విషయం గాడి తప్పేసింది.
సుశాంత్ ఆఫీసు వ్యవహారాలు, బండి కొనే సీన్లు, డ్రైవింగ్ నేర్చుకోవడం ఇవన్నీ ఏమతంత ఇంట్రస్టింగ్ గా చూపించలేదు. కాలనీ దగ్గర కథ లాక్ అయిన తరవాత.. సినిమా పరుగులు పెడుతుంది అనుకుంటారు. కానీ అక్కడా నాన్చుడు ధోరణే. హీరోయిన్ రూమ్ లో హీరో స్ట్రక్ అయిపోయి.. మొత్తం వ్యవహారాన్ని ఫోన్లో నడపాలని చూస్తాడు. అక్కడైతే సినిమా దుప్పటి కప్పుకుని మరీ బొబ్బుంది. `ఇలా చేస్తే.. హీరో ఈజీగా బయటపడిపోవొచ్చు కదా` అని సీట్లో కూర్చున్న ప్రేక్షకుడికే తెలిసిపోతుంటుంది.. కాన కెప్టెన్ కుర్చీలో కూర్చున్న దర్శకుడికి మాత్రం తెలియదు. అసలు కాలనీలో ఏం జరుగుతుందో, దోషులెవరో…. చివర్లో కనిపెట్టేస్తాడు హీరో. అది కూడా ఫక్తు సినిమాటిక్ గా ఉంది.చాలా చోట్ల దర్శకుడు ఈ కథని తనకు అనువుగా రాసుకున్నాడు. కథలో క్లిష్టత కావాలని సృష్టించుకున్నదే. సహజంగా జరిగినదైతే.. సహజంగానే బాగుండేది. ఓ విషయాన్ని రియలిస్టిక్ గా చెప్పాలి అనుకుంటే.. పూర్తిగా ఆ పంథాలో వెళ్లిపోవాలి. లేదంటే.. కమర్షియల్ పద్ధతిలోనే చెప్పాలి. రెండింటికీ మధ్య ఇరుక్కుంటే.. అక్కడ ఇలా `నో పార్కింగ్` బోర్డు పెట్టాల్సివస్తుంది.
సుశాంత్ కొత్తగా కనిపించాలని చాలా తాపత్రయపడ్డాడు. కొన్ని చోట్ల మారాడనిపించింది కూడా. అయితే తనకు ఇంకాస్త ఈజ్ రావాల్సివుంది. కాస్ట్యూమ్స్ బాగున్నా, మేకప్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. మీనాక్షి సోసోగా ఉంది. నటన కూడా అంతంతమాత్రమే. `సుశాంత్ తో లిక్ లాక్ కి ఓకే` అన్న తరవాతే… ఆమెని ఈ సినిమాలోకి తీసుకుని ఉంటారు. ప్రియదర్శి, అభివన్ గోమట్టం, వెన్నెల కిషోర్ ఉన్నా – కామెడీ మాత్రం ఆశించలేం. సునీల్ ని ఓ 5 నిమిషాల పాత్ర కోసం రంగంలోకి దించారు. ఉన్నంతలో తాను ఓకే.
పాయింట్ బాగుంది కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే పూర్తిగా తేడా కొట్టేసింది. కూర్చోబెట్టేసే సన్నివేశాలు, ఎమోషన్… ఈ సినిమాలో కనిపించదు. పాటలు తక్కువే. రెగ్యులర్ డ్యూయెట్లు లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించింది. కాలనీ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది.
సాదాసీదా కంటెంట్ అస్సలు ప్రేక్షకులకు ఆనడం లేదు. ఏదో బ్రహ్మాండం బద్ధలైపోయే మేటర్ ఉండాల్సిందే. అందులోనూ… స్టార్ కాస్టింగ్ లేని సినిమాలకు. `ఇచ్చట వాహనములు నిలపరాదు` టైటిల్ చూసి, కచ్చితంగా కొత్త విషయమేదో ఇందులో ఉంటుందని ఆశిస్తారంతా. కానీ.. ఇచ్చట మేటర్ కూడా లేదన్న విషయం తరవాత అర్థమవుతుంది.
ఫినిషింగ్ టచ్: ఇచ్చట మరీ ఎక్కువ ఆశించరాదు
రేటింగ్: 2.25/5