తెలుగుదేశం కంచుకోట…ఇచ్ఛాపురం నియోజకవర్గం. టీడీపీ ఏర్పాటు తర్వాత ఒకే ఒక్క ఎన్నికలో ఓడిపోయింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా జగన్ అనేక సమీకరణాలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇచ్చాపురం ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. ఉద్దానంగా పిలిచే ప్రాంతంలో భాగం ఇచ్చాపురం. మొత్తం 2 లక్షల 70వేల మంది వరకూ ఓటర్లుఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప తేడా గెలిచింది. మరోసారి గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత రెండు సార్లు టీడీపీ తరపున బెందాళం అశోక్ పోటీ చేసి గెలిచారు. 2014లో బెందాళం 20వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. గత ఎన్నికల్లో ఆ మెజార్టీ ఎనిమిది వేలకు పడిపోయింది. కానీ జనసేన పార్టీ అభ్యర్థి పన్నెండు వేల ఓట్లకుపైగా పొందారు. ఈ సారి జనసేన మద్దతు టీడీపీకి ఉంటుంది. అందుకే టీడీపీ మరింత ధీమాగా ఉంది.
జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్సకార సామాజిక వర్గాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో కళింగ, బెంతు ఒడియా, శ్రీశయన సామాజిక వర్గాలు ఉన్నాయి. టీడీపీ ఏర్పాటు తరువాత ఇచ్ఛాపురం…ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983 నుంచి ఇప్పటికు 9 సార్లు ఎన్నికలు జరిగితే…ఎనిమిది సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 2004లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్…తెలుగుదేశం పార్టీపై గెలుపొందారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న బెందాళం అశోక్, పిరియా సాయిరాజ్ కుటుంబాలు రెండు…కళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇచ్చాపురం సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకనుగుణంగా మాజీ ఎమ్మెల్యే, కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించి గత ఎన్నికల్లో పోటీకి చాన్స్ ఇచ్చింది. గతంలో టీడీపీతరపున గెలిచిన సాయిరాజ్ వైసీపీ తరపున గెలవలేకపోయారు. ఇప్పుడు ఆయన భార్యకు టిక్కెట్ ఇచ్చారు. ఆయన భార్యది కమ్మ సామాజికవర్గం. ఆమె ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు.
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ బీసీలతో అధిపత్యం .జనాభాలో అత్యధికంగా ఉన్న తూర్పుకాపు, పోలినాటి వెలమ, కాళింగ సామాజిక నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇచ్చాపురంలో అయితే కాళింగులతోపాటు రెడ్డిక, యాదవ సామాజిక వర్గాలు పోటీ పడుతుంటారు. పిరియా సాయిరాజ్ కుటుంబానికి టిక్కెట్ కేటయించడంతో వైసీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. అత్యధిక సంఖ్యాబలం కలిగిన రెడ్డిక సామాజిక వర్గానికి ఈ సారి అవకాశం కల్పించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. వారు వైసీపీ పై అసంతృప్తిగ ఉన్నారు. ఇక యాదవ్ వర్గం కూడా వైసీపీపై అసంతృప్తిగా ఉంది. పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. నర్తు రామారావు, నరేశ్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర, పిరియా సాయిరాజ్ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని కేడర్ చెప్పుకుంటోంది. గతంలో ఓటమికి ఇదే ప్రధాన కారణం అయిందని ఇప్పుడు అదే బాటలో నేతలు వెళ్తున్నారనే విమర్శ ఉంది.
ప్రతి ఎన్నికల రాజకీయ పార్టీలు ఇచ్చాపురం ప్రజలపై పలు హామీలు గుప్పిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే…సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్‌ను రద్దు చేసిన ప్రాంతంలో పుడ్ ప్రోసెస్ యూనిట్లు పెడతామని చెబుతున్నాయి. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని, మరో కోనసీమగా పిలుచుకునే ఉద్ధానం కొబ్బరి రైతులను ఆదుకుంటామని చెప్పాయి. బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇచ్ఛాపురం మున్సిపాలిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని తాగునీరు, డంపింగ్ యార్డు సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చాయి. ఉద్దానం కిడ్ని రోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, బీల చిత్తడి నేలకు హాని కలిగించకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామన్న హామీ నేటికి నెరవేరలేదు. ఇచ్చాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, కవిటి మండలంలో కోకోనట్ పార్క్, పురుషోత్తపురంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించకపోవడం వైసీపీకి మైనస్‌గా మారనుంది. వైసీపీలో ఉన్న గ్రూపులు గోల బెందాళం అశోక్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ… నిర్లక్ష్యంగా ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నేతుల ప్రజలు ఓట్లు వేయడానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారన్నదానిపైనా ఫలితం ఆధారపడి ఉంటుంది.
జనసేన పార్టీ ఓటు బ్యాంక్ పదిహేను వేల వరకూ ఉడంటంతో అది టీడీపీకి కలసి వస్తుంది. సామాజికవర్గాలకు అతీతంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీకి జనం ఆదరణ ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరు అన్నది కాకుండా.. గుర్తునే ప్రధానంగా చూసుకుంటారు. రాజకీయాలు ఎలా మారుతున్నా.. అక్కడి ప్రజలు ఈ ఆదరణ చూపిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని.. జనసేన మద్దతులో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. హోరాహోరీగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. సామాజిక పరంగా విజయకు కాస్త మద్దతు ఉన్నప్పటికీ సాయిరాజ్ నేపథ్యాన్ని చూసిన వారంతా మద్దతు తెలిపేందుకు వెనుకంజ వేస్తున్నట్టు వైసీపీ శ్రేణులే చెబుతున్నారు. ఇక్కడ మూడు సామాజిక వర్గాలు అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కళింగులను, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చి యాదవులను, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి రెడ్డిక వర్గాలను వైసీపీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది.