ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము కరోనా టెస్టుల్లో దేశంలోనే నెంబర్ వన్ అని రోజూ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. రోజుకు ఐదు నుంచి ఎనిమిది వేల టెస్టులు చేస్తున్నట్లుగా వివరాలు ప్రకటిస్తూ ఉంటుంది. పది లక్షల మంది సగటును తీసుకుంటే.. తాము పదిహేను వందల మందికిపైగా టెస్టులు చేశామని ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. అయితే.. ఈ కరోనా వ్యవహారాల్ని మొత్తం డీల్ చేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. ఐసీఎంఆర్ మాత్రం… వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశంలో జరిగిన కరోనా టెస్టులపై ప్రకటన చేసిన ఐసీఎంఆర్… ఆంధ్రప్రదేశ్ ఇంకా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చేసింది.
దేశంలో పది లక్షల టెస్టుల మైలురాయిని దాటామని ఐసీఎంఆర్ తాజాగాఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం..మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు లక్షకుపైగా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ రాష్ట్రాలు చురుగ్గా పరీక్షలు నిర్వహిస్తూ… వైరస్ సోకిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక , ఢిల్లీ రాష్ట్రాలు టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవడంలో వెనుకబడ్డాయని తేల్చింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ తాము లక్షకుపైగా టెస్టులు చేశామని అధికారికంగా ప్రకటించుకుంది. అధికారిక డాష్ బోర్డులోనూ చెప్పుకుంటోంది. కానీ ఐసీఎంఆర్ గుర్తించడం లేదు.
ఏపీ సర్కార్.. ఆర్టీ -పీసీఆర్ టెస్టులతోపాటు.. కొరియా నుంచి తెప్పించిన యాంటీ బాడీ కిట్లు..అలాగే ట్రూనాట్ కిట్లతో పరీక్షలు చేస్తోంది. ఐసీఎంఆర్.. ఒక్క ఆర్టీ-పీసీఆర్ టెస్టులను మాత్రమే.. పరిగణనలోకి తీసుకుంటోంది. అది ఒక్కటి మాత్రమే నమ్మదగిన పరీక్ష అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఆర్టీ- పీసీఆర్ పరీక్షల సామర్థ్యాన్ని పెద్దగా పెంచుకోలేదు. ఇప్పటికే ఇరవై నాలుగు గంటలూ పని చేస్తే.. పదిహేను వందల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయగలరు. అంతకు మించిచేయలేరు. అయినా.. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటోంది. దీన్ని ఐసీఎంఆర్ లైట్ తీసుకుంది.