కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. గడచిన రెండ్రోజులుగా నలుగురు ఐటీ అధికారులు రేవంత్ ఇంట్లోనే ఉంటూ ఆదాయానికి మించిన ఆస్తులపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. దీన్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లు, ప్రింట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాదాపు 43 గంటలపాటు రేవంత్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. రేవంత్ రెడ్డిని 31 గంటలపాటు విచారించారు. మొత్తానికి, శనివారం తెల్లవారు జామున 2 గ. 30 ని.లకు ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. అయితే, అక్టోబర్ 3న ఐటీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఉదయ సింహను అక్టోబర్ 1న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఐటీ దాడిలో దాదాపు రూ. 20 కోట్ల విలువల గల లెక్కలు చూపని ఆస్తుల వివరాలను అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సొమ్ము రేవంత్ బావమరిది జయప్రకాష్ రెడ్డి పేరుతో ఒక కంపెనీకి చెందినవిగా ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. రేవంత్ తోపాటు ఆయన భార్యను కూడా అధికారులు విచారించారు. దాదాపు 150 ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారనీ, అవి కూడా లిఖిత పూర్వక సమాధానాలని తెలుస్తోంది. విచారణలో భాగంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన రూ. 50 లక్షల నగదుకు సంబంధించి కూడా అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. రేవంత్ వియ్యంకుడు పోర్షే కారు వాడుతున్నారని అధికారు అడిగితే… దాన్లో తప్పేముందీ, ఆయన పోర్షే కారులో తిరగడమూ నేరమేనా అంటూ రేవంత్ కొంత ఘాటుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది.
రేవంత్ ఇంట్లో సేకరించిన డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియ శనివారం కూడా కొనసాగే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చూపించిన ఆస్తుల వివరాలకు, ఆ తరువాత ఆయన చెల్లిస్తున్న పన్నులకూ మధ్య పొంతన లేదని అధికారులు గుర్తించారట. అంతేకాదు, ఆదాయానికి తగ్గట్టుగా పన్నులు చెల్లించడం లేదన్న ఆరోపణలు కూడా అధికారుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఇక, తాజా దాడుల గురించి… దీన్లోని రాజకీయ కోణం గురించి రేవంత్ రెడ్డి మీడియాకు శనివారం వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.