తెలుగు360 రేటింగ్: 1.5/5
ఫీల్ గుడ్ కథలు రావాల్సిందే.
అప్పుడే కదా.. ప్రేక్షకులు రసానుభూతికి లోనయ్యేది.
ప్రేమనే కాదు, ఏ భావాన్నయినా… అందులోని గాఢతనీ, తీవ్రతనీ – ఓ చల్లని గాలి వీచినట్టు హాయిగా చెబుతూ, మధ్యమధ్యలో కన్నీళ్లు తెప్పించి, నవ్వించి, జ్ఞాపకాల్లో ముంచి, చివర్లో గుండెబరువెక్కించి థియేటర్లలోంచి సాగనంపడం ఫీల్ గుడ్ కథల లక్షణం, లక్ష్యం. ఇలాంటి కథలు కమర్షియల్ జోనర్‌కి దూరంగా ఉండొచ్చు. బాక్సాఫీసు లెక్కలు వాటికి ఎక్కకపోవొచ్చు. కానీ.. మంచి చిత్రాల జాబితాలో వాటికి స్థానం తప్పకుండా ఉంటుంది.
అయితే ఆ ఫీట్ గుడ్‌గా ఉంది అని దర్శకుడు, రచయితా, హీరోలు ఫీలైతే చాలదు. ఆ ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగాలి. ఫీల్ గుడ్ సినిమా కదా అని.. దానిని మరింత నీరసంగా, నిస్తేజంగా తీర్చిదిద్దితే – ఇలాంటి సినిమాలు చూడ్డానికి నిజంగా ప్రేక్షకులు ఫీల్ అవ్వాల్సివస్తుంది. ఆ లెక్కలు, తూకాలు సరిగా అర్థం కావాలి. చాలా కాలం గాహిట్సు లేని రాజ్ తరుణ్, కెరీర్ బాగా డల్‌గా ఉన్నప్పుడు ఎంచుకున్న ఓ ఫీల్ గుడ్ సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. మరి ఈ కథలో నిజంగా ‘ఫీల్’ ఉందా? అది ‘గుడ్’ అనిపించుకుందా..? రాజ్ తరుణ్ లెక్కలు సరిగాగానే వర్కవుట్ అయ్యాయా?
కథ
వర్ష (షాలినీ పాండే) హీరోయిన్ కావాలని కలలు కంటుంటుంది. తన ప్రయత్నాలు ఏమాత్రం నిలబడవు. ఎన్ని ఆడిషన్స్‌కి వెళ్లినా… అవమానాలే. అలాంటి పరిస్థితుల్లో తన చిననాటి నేస్తాన్ని, పద్దెనిమిదేళ్ల తరవాత అనుకోకుండా కలుస్తుంది. తన పేరు.. మహి (రాజ్‌తరుణ్). ఇద్దరూ ఒకే రోజు, ఒకేసారి, ఒకే ఆసుపత్రిలో పుట్టారు. అప్పటి నుంచీ వర్ష అంటే మహికి చాలా ఇష్టం. అయితే.. అనుకోకుండా చిన్నప్పుడు విడిపోతారు. మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకుంటారు. మహి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం వల్ల… వర్ష హీరోయిన్ కావాలన్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్సొస్తుంది. మహిలో ప్రేమ మళ్లీ మొగ్గ తొడుతుతుంది. అయితే.. మహికి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. అది తీవ్రతరం అవుతూ వస్తుంది. మరోవైపు మహిపై వర్షకీ ప్రేమ మొదలవుతుంది. మరి… మహి తన ప్రేమని వర్ష ముందు వ్యక్తపరిచాడా? విధి వీరిద్దరి జీవితాలతో ఎలాంటి ఆటలు ఆడుకుంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
ఓ టర్కీ సినిమా కథని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. దర్శకుడు మాతృకని చాలా సందర్భాల్లో ఫాలో అయ్యాడు. అలాగని ఇదేం కొత్త కథ కాదు. విధి విరోధిగా మారి ప్రేమికులను విడదీయడం చాలాసార్లు చూశాం. ఇప్పుడూ అలాంటి కథే. ఫీల్ గుడ్ సినిమాకి కావల్సిన ఎమోషన్స్ పండించే ఛాన్స్ ఈ కథలో దర్శకుడికి దొరికింది. ఈమధ్య ఫీల్ గుడ్ చిత్రాలకూ బాక్సాఫీసు దగ్గర కాసులు కురుస్తుండడంలో నిర్మాతలు కూడా ఈ కథవైపు మొగ్గు చూపించి ఉంటారు.
గీతాంజలి కూడా ఫీల్ గుడ్ సినిమానే. అందులో హీరో, హీరోయిన్ల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఎమోషన్ పండుతూ ఉంటుంది. చావు అనే ఫ్యాక్టర్ క్లైమాక్స్ వరకూ ప్రేక్షకులను డిస్ట్రబ్ చేయదు. వీరిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అక్కడ ప్రేమ అనే వస్తువు, చావుని, ఆ భావనని డామినేట్ చేస్తుంటుంది. ఈ సినిమాలో అలా కాదు. ద్వితీయార్థం నుంచే – చావు పొంచి ఉన్న విషయం ప్రేక్షకుడికి అర్దం అవుతూ ఉంటుంది. అంతకు ముందు నుంచే.. హీరో పాత్రని చాలా సెటిల్డ్‌గా, అసలే మాత్రం ఉత్సాహం లేనివాడిలా, నీరసానికి నిలువెత్తు నిదర్శనంలా తీర్చిదిద్దుతూ వచ్చాడు దర్శకుడు. హీరో.. గొంతు చించి ఒక్కసారి కూడా మాట్లాడడు. పెద్దగా నవ్వడు. అసలు ఆ పాత్రలో స్పీడే ఉండదు. ఇచ్చిన మాటలు కూడా చాలా తక్కువే. ఓ ఆర్ట్ సినిమాలో హీరో ఎలా ఉంటాడో… ఈ సినిమాలో హీరోని అలా తీర్చిదిద్దారు. అతనేమాత్రం ఉత్సాహం చూపించినా ఫీల్ గుడ్ ఎమోషన్ మిస్ అయిపోతుందేమో అని దర్శకుడు కంగారు పడి ఉంటాడు.
నిజానికి కథానాయకుడిని మరీ అంత డల్‌గా చూపించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సెకండాఫ్ లో పాత్ర ఎలాగూ అలానే ప్రవర్తించాల్సివస్తుంది కాబట్టి – అప్పుడు తప్పదు. ముందు నుంచే మహి పాత్రని అలా డిజైన్ చేయడం ఎందుకు? వర్ష పాత్ర చాలా హుషారుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, తన దగ్గర్నుంచి కూడా డల్ మూమెంట్సే కనిపిస్తాయి. ఛైల్డ్వుడ్ ఎపిసోడ్లు సైతం నీరసంగా సాగుతాయి. సినిమా అంతా ఓ స్లో మోషన్ వీడియోని చూస్తున్నట్టు అనిపిస్తుంది. వర్ష హీరోయిన్గా చేసే ప్రయత్నాల్లోంచో, ఇండ్రస్ట్రీ పరిస్థితుల నుంచో కాస్తో కూస్తో వినోదం పండిచొచ్చు. కానీ ప్రేక్షకులు ఒక్కసారి నవ్వితే, ఫీల్ గుడ్ సినిమా అనే విషయం మర్చిపోతారేమో అని ఆలోచించి ఉంటాడు.
ఊటీలో సీన్లయినా కాస్త రిఫ్రెష్‌గా, ప్రేక్షకుల నాస్ట్రాలజీ మూమెంట్స్ గుర్తొచ్చేలా రాసుకోవాల్సింది. పతాక సన్నివేశాల ముందు వరకూ… ఈ కథ, సన్నివేశాలు, పాత్రలు నత్త నడక నడుస్తూనే ఉంటాయి. మధ్యమధ్యలో వచ్చే పాటలు కూడా మరింత స్లోగా సాగుతూ – ఉత్సాహాన్ని ఏమాత్రం ఎలివేట్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాయి. క్లైమాక్స్ లో గుండె బరువెక్కించే సన్నివేశాలు ఎన్నిరాసుకుని ఏం లాభం? అప్పటికే రెండు ప్రధాన పాత్రలతో పాటు కథ, కథనాలు కూడా ఐసీయూలోకి షిఫ్ట్ అయిపోతే..?!
నటీనటులు
రాజ్ తరుణ్ అంటే హుషారైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. తన ఎటకారం, చమత్కారం, ఎనర్జీ తనకు ప్లస్ పాయింట్స్. వాటిని వదిలేసిన రాజ్‌తరుణ్, ఆయుధం వదిలేసి, ఒంటిచేత్తో పోరాడే సైనికుడిలా తయారయ్యాడు. అసలు ఏ పాయింట్ నచ్చి ఈ కథ చేశాడో అర్థం కాదు. ఒక వేళ ఈ సినిమా హిట్ అయినా, తనలోని నటుడికీ, తన కెరీర్‌కీ ఉపయోగపడే సినిమా కాదు. షాలినీ పాండే అందంగా కనిపించింది. తను లిప్ సింక్ చూసుకోవాలి. ఈ రెండు పాత్రలూ మినహాయిస్తే తెరపై పట్టుమని పది నిమిషాలుండే పాత్ర మరేదీ ఉండదు. కమెడియన్ భరత్ కైనా కాస్త స్కోప్ ఇవ్వాల్సింది.
సాంకేతిక వర్గం
మిక్కీ పాటలు బాగున్నాయి. కాకపోతే వాటిని రిజిస్టర్ చేయించే సన్నివేశాలు లేవు. యువర్మై హార్ట్ బీట్ పాట మాత్రం ఇంకొంత కాలం వినిపిస్తుంది. కథ టర్కీ నుంచి తీసుకొచ్చింది. అందులో గాఢత దర్శకుడికి నచ్చి ఉండొచ్చు. కానీ… ఆ కథని ఇంత నీరసంగా తీసి ఉండాల్సింది కాదు. ఈ రోజుల్లో మరీ ఇంత స్లో నేరేషన్ అంటే మింగుడు పడని అంశం. సిమ్లా అందాల్ని కెమెరా భలే బాగా చూపించింది. ఫొటోగ్రఫీకి తప్పకుండా మంచి మార్కులు పడతాయి.
ఫినిషింగ్ టచ్: ఈలోకం.. చాలా నీరసం
తెలుగు360 రేటింగ్: 1.5/5