ఇప్పటి లవ్ స్టోరీల జమానానే వేరు. లవ్ కంటే క్రష్ ఎక్కువగా కనిపిస్తుంది. అనుభూతుల కంటే `ఆ` అనుభవాల కోసం పరితపించడం చూస్తూనే ఉన్నాం. లవ్ స్టోరీల్లో ముద్దులూ, హగ్గులూ లేకపోతే ఎలా, సెక్స్ సీన్లు జోడించకపోతే చూస్తారా? అనే స్థాయికి దిగజారిపోయి ఆలోచిస్తున్నాం. అలాంటి చోట.. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూపించే ప్రయత్నం చేస్తోంది `ఇద్దరి లోకం ఒక్కటే` టీమ్.
రాజ్‌తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రమిది. జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి క్లీన్ సినిమాని ఆశించొచ్చు. దానికి తగ్గట్టే ట్రైలర్ సిద్ధమైంది. కూల్ కూల్ లవ్ స్టోరీని చూపించే ప్రయత్నం కనిపించింది. విజువల్స్, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ స్మూత్‌గా ఉన్నాయి. ఇద్దరు బాల్య స్నేహితుల కథ ఇది. ఓ అమ్మాయి, అబ్బాయి చిన్నప్పుడే ఫ్రెండ్స్. పద్దెనిమిదేళ్ల తరవాత మళ్లీ కలుసుకుంటారు. ఇద్దరూ ఊటీ వెళ్తారు. అక్కడ తమ బాల్య జ్ఞాపకాల్ని మళ్లీ నెమరు వేసుకుంటారు. `ప్రేమించడం లేదంటే నువ్వు ఇష్టం లేదని కాదు, నీతో జీవితాంతం గడిపేంత ఫీలింగ్స్ లేవని` అని ఆ అమ్మాయి వెళ్లిపోతుంది. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ఓ అబ్బాయి అమ్మాయిని మూగగా ఆరాధించడం, తన ప్రేమని సాధించుకోవడం – ఇదే కథ. ట్రైలర్లోనే కథ చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంట చాలా ముచ్చటగా కనిపిస్తోంది. సమీర్ రెడ్డి విజువల్స్, మిక్కీ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి చాలాకాలమైంది. మరి.. రాజ్ తరుణ్ జాతకం ఎలా వుందో చూడాలి.