15 ఏళ్లు.. 150 సినిమాలు, 1000 ఫైట్స్… ఇదీ ఫైటర్స్‌గా రామ్ -లక్ష్మణ్ చరిత్ర. పరిశ్రమలో వీళ్లకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు. రామ్‌లక్ష్మణ్ చేతికి ఓ ఫైట్ అప్పగిస్తే… అది వేరే లెవిల్లో తీస్తారన్న పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఫాదర్స్ డే, మదర్స్‌డే, లవర్స్‌డే జరుపుకొటున్నాం కదా, తెలుగు సినిమా డే కూడా జరుపుకొందాం.. అంటున్నారు. ”సినీ కళామతల్లి మనకు అన్నం పెట్టింది. ఆ అమ్మరుణం తీర్చుకోవాలి. ఏడాదికి ఒక్కరోజైనా పండగలా జరుపుకోవాలి.. అదే తెలుగు సినిమాకి మనం ఇచ్చే గౌరవం” అంటున్నారీ బ్రదర్స్.
ఆలోచనకైతే బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆచరణ ఎలా?? తెలుగు సినిమా దినోత్సవం అంటూ ఓ వేడుకలా జరిగితే.. కన్నుల పండగగా ఉంటుంది. కానీ చేసేదెవరు? ఇండ్రస్ట్రీ అంటేనే కులాల కుమ్ములాట. ఆధిపత్యధోరణి. అలాంటప్పుడు అందరూ కలిసి ముందుకొస్తారా.? వజ్రోత్సవల సమయంలో సెలబ్రెటీ, లెజెండ్ అంటూ రెండు పదాలు పట్టుకొని, దాటి చుట్టూ చేసిన రగడ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే జరగదని గ్యారెంటీ ఏమిటి? దాసరి నారాయణరావుపై ఉన్న గౌరవంతో ఆయన పుట్టిన రోజుని డైరెక్టర్స్ డేగా జరుపుకొంటున్నారు. అయితే పేరుకు మాత్రమే అది డైరెక్టర్స్ డే. కానీ ఆ రోజు ఇండ్రస్ట్రీ పట్టించుకొన్నదే లేదు. ఇప్పుడు సినిమా డే అని పేరు పెట్టినంత మాత్రాన అదో వేడుకలా చేస్తారనుకోవడం మన భ్రమ. ఏదో ప్రెస్ మీట్ పెట్టి తమ ఆలోచన తెలియజేశారు బాగానే ఉంది. కానీ.. తెలుగు సినిమా డే జరుపుకోవడానికి ఓ నిధి ఏర్పాటు చేసి, తమ వంతుగా తొలి చందా ఇస్తే బాగుండేది. ఆ స్ఫూర్తి ఇంకాస్త బలంగా జనాల్లోకి వెళ్లేది. కానీ.. వీళ్లూ మాటలకే పరిమితం చేశారు.