తెలంగాణ కాంగ్రెసు పార్టీ పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. హఠాన్మరణానికి గురైన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బరిలోకి దింపడానికి ఆయన కుటుంబసభ్యులే కావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెసు పార్టీ.. ఆయన భార్య సుచరిత పేరును ప్రస్తుతానికి ఫైనలైజ్ చేసి.. అధిష్ఠానం ముద్ర కోసం పంపిన సంగతి తెలిసిందే. ఇంకా అటునుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అభ్యర్థి సంగతి అప్పుడే తేలకపోయినా సరే.. అవతలి పార్టీ వారికి మాత్రం అవకాశాలకు గండికొట్టాలని ఇప్పుడు కాంగ్రెస్ తాపత్రయపడుతున్నట్లున్నది. ఖమ్మం జిల్లాలో తెరాస ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ ప్లీనరీకి అనుమతి ఇవ్వరాదంటూ.. ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు చేస్తున్నది.
పాలేరులో ఉప ఎన్నికలు వస్తాయనేది ఊహించగలిగే సంగతే. వాటిని దృష్టిలో ఉంచుకునే తెరాస ఖమ్మం జిల్లాలో ప్లీనరీని ప్లాన్ చేసిందా అనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వచ్చాయి. ఈ కోణంలో కూడా తెలుగు360 ఒక కథనాన్ని అందించింది. అయితే.. దానినే ఇప్పుడు అధికార పార్టీకి ప్రమాదకరమైన ఎడ్వాంటేజీగా చూపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం విశేషం.
అధికార పార్టీ ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహించడానికి పూనుకోవడం అనేది నిబంధనలకు విరుద్ధం అని, అదే జరిగితే.. వీరు పాలేరు నియోజకవర్గ పరిధిలో ఓటర్లను అనుచితమైన రీతిలో ఆకట్టుకోవడం కూడా సాధ్యం అవుతుందని కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తున్నది.
అయితే తెరాస వర్గాలు మాత్రం వీరి ఫిర్యాదును తీసిపారేస్తున్నాయి. ప్లీనరీ గురించి పార్టీ నిర్ణయం ఎప్పుడో జరిగిందని, ఇప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెసులో భయాన్ని సూచిస్తున్నదని అంటున్నారు. గెలిచే అవకాశం లేనప్పుడే.. తెరాస మీద నిందలు మోపడానికి ముందస్తుగా ఇలాంటి అసత్య ఆరోపణలకు కాంగ్రెసు పూనుకుంటున్నట్లుగా వారు పరిగణిస్తుండడం విశేషం.