ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులే లక్ష్యంగా ఏపీ సీఐడీ నమోదు చేస్తున్న వింత కేసుల్లో ప్రజలకు వస్తున్న సందేహాలను తీర్చే వారే కనిపించడం లేదు. చివరికి న్యాయస్థానాల్లోనూ ఆ అంశాలు ప్రస్తానకు రావడం లేదు. అసలు మొత్తం చేసేది అధికారులు అయితే.. ఇక్కడ ఎందుకు వారి పేర్లు పరిగణనలోకి రావడం లేదన్నది ఆసక్తికరంగా మారింది.
సీఐడీ చెబుతున్న ఏ స్కామ్‌లోనూ అధికారుల పేర్లు లేవు !
సీఐడీ ఇప్పటికి చాలా కేసులు నమోదు చేసింది. ముందు ముందు ఎన్ని నమోదు చేస్తుందో తెలియదు. స్కిల్ కేసు, రిగ్ రోడ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు ఇలా కేసులు నమోదు చేస్తూనే ఉంది. వీటన్నింటిలో అంతిమ లబ్దిదారులు చంద్రబాబు, ఫ్యామిలీ అని వాళ్లను మాత్రమే నిందితులుగా చేరుస్తున్నారు. నేరుగా అప్పటి ముఖ్యమంత్రిని నిందితుడిగా చేరుస్తున్నారు.. ఈ ప్రక్రియలో నేరం జరిగిందే కింది వాళ్లు కూడా బాధ్యులవుతారు కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క అధికారి పేరునూ సీఐడీ చెప్పడం లేదు.
మొత్తం బాధ్యత అధికారులదే – రాజ్యాంగం చెప్పేది అదే !
అధికారం ప్రజలు ఇస్తారు. ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో రాజ్యాంగం చెబుతుంది. అధికారం ఉందని రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిచి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఎగ్జిక్యూట్ చేయాల్సిన అధికారులు తిరస్కరించాలి. లేకపోతే వారు కూడా తప్పు చేసినట్లే. మరి తప్పులు జరిగిపోయాయనని కేసులు పెడుతున్న సీఐడీ అధికారులు ఎందుకు అధికారుల ప్రస్తావన తీసుకు రావడం లేదు. అధికారుల స్థాయిలో అన్నీ బాగున్నాయనుకుంటే ఇక అవినీతికి చోటు ఎక్కడ ఉంటుంది.
కోర్టుల్లో తేలిపోయినా బురద చల్లడానికి, జైల్లో పెట్టడానికే ప్లాన్ !
సీఐడీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల్లో అసలు విషయం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ కేసులన్నీ అరెస్టులు చేయడానికి … అనుకున్న వాళ్లని కొద్ది రోజులు అయినా జైల్లో పెట్టడానికి.. రాజకీయంగా తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అది వారికీ తెలుసు. సీఐడీని పావుగా వాడుకుని.. న్యాయస్థానాల కళ్లకు గంతలు కట్టి వాటిని గరిష్ఠంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వ్యక్తుల హక్కుల ఉల్లంఘనే. ఈ పరిస్థితి రేపు ఎవరికైనా రావొచ్చు.