ఓ వైపు పెద్ద తమ్ముడు నాగబాబు చిరంజీవి సక్సెస్ స్టోరీస్‌ను యూట్యూబ్ వీడియోల రూపంలో చెప్పి.. మంచి వ్యూస్ సాధిస్తూంటే… చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం.. చిరంజీవి ఫెయిల్యూస్ స్టోరీస్‌ను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు సీఎంగా ఉండేవారని.. పవన్ కల్యాణ్ తిరుపతిలో జన సైనికుల ముందు బాధపడ్డారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదని కార్యకర్తలకు హితబోధ చేశారు. ” చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అధికారం మనకు బాధ్యత, అలంకారం కాదు..” అని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉంది.
సిట్యువేషన్ డిమాండ్ చేయకపోయినా పవన్ కల్యాణ్ అప్పుడప్పుడూ చిరంజీవి ప్రస్తావన తెస్తూంటారు. అదిపాజిటివ్ వేలో తీసుకు వస్తే..ఫ్యాన్స్ సంతోష పడే వారేమో. కానీ.. పవన్ కల్యాణ్ ఎక్కువగా… పీఆర్పీ ఫెయిల్యూర్.. చిరంజీవి ఓటమి.. చిరంజీవిని ఇతర నేతలు మోసం చేసిన వైనం.. ఇలా అనేక రకాలుగా తెరపైకి తెస్తూ ఉంటారు. ఇవన్నీ నెగెటివ్ యాంగిల్లో వెళ్తూ ఉంటాయి. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మానుకున్నారని పవన్ కల్యాణే ప్రకటించారు. చిరంజీవి అధికారికంగా తాను రాజకీయాల నుంచి విరమించానని ప్రకటించలేదు. కానీ.. ఆయన సినిమాలకు అంకితమైపోయారు. సినీ హీరోగానే అన్ని రాజకీయ పార్టీల పట్ల స్పందిస్తున్నారు. తన పరాజకీయ పయనం అంతా ఓ పీడకల అని ఆయన అనుకుంటున్నారు. అలాంటప్పుడు… పవన్ కల్యాణ్ పదే పదే ఎందుకు గుర్తు చేస్తూంటారో ఫ్యాన్స్‌కు కూడా సరిగ్గా అర్థం కాని విషయం.
చిరు ఫెయిల్యూర్‌ను గుర్తు పెట్టుకుని తాను.. మరింతగా ఎదగాలని స్ఫూర్తి పొందితే దాన్ని.. అందరి ముందు ఎక్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల మైనస్సే కానీ ప్లస్ కాదు. చెప్పుకోవడానికి చిరంజీవి ప్లస్ పాయింట్లు ఎన్నో ఉంటాయి. వాటిని చెప్పుకోవచ్చు. నిజానికి పవన్ కల్యాణ్ అభిప్రాయం ప్రకారం.. చిరంజీవిరాజకీయాల్లో ఓపికతో ఉండి ఉంటే.. ఆయనకు మంచి భవిష్యత్ ఉండేదని.. అందరి అభిప్రాయం. ఆ మాత్రం ఓపికను చిరంజీవి అప్పట్లో చూపించలేకపోయారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలేననే నానుడి ఊరికే రాలేదు.. చిరు గమనాన్ని చూసి పవన్ కల్యాణ్ కూడా.. నేర్చుకోవాల్సి ఉంది. లేకపోతే.. అలాంటి పరిస్థితే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సింది లేదు.