ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ భయంకర స్థాయిలో విరుచుకుపడుతోందని.. నిర్ధారించుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. నిజానికి ఆ పరిస్థితిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఊహించింది. కేంద్రం కూడా ఊహించింది. అందుకే జాతీయ విపత్తుగా ప్రకటించింది. అయినప్పటికీ.. అలా ఎన్నికలను వాయిదా వేసినందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆయనపై వేసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. కులం పేరుతో కూడా.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విమర్శించారు. ఎన్నికలు జరపాల్సిందేనని.. చీఫ్ సెక్రటరీతో లేఖ కూడా రాయించారు. అలా లేఖ రాసిన… మూడు రోజుల్లోనే సీన్ మారిపోయింది.
ఎన్నికల వాయిదాను ప్రశ్నించిన చోట నుంచే లాక్ డౌన్ ప్రకటించిన జగన్..!
ముఖ్యమంత్రి ఏ స్థానంలో కూర్చుని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్… కుట్ర పూరితంగా కరోనాను సాకుగా చెప్పి.. ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారో.. అదే స్థానంలో కూర్చుని.. అదే కరోనా కారణంగా.. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని చాలా మందికి తెలుసు. ప్రభుత్వంలో ఉన్న వారికీ తెలుసు. కానీ ప్రజారోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యమనుకున్న.. ప్రభుత్వాధినేతల మనసును నొప్పించి.. ఆనక.. నిమ్మగడ్డలాంటి పరిస్థితుల్ని తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక.. మౌనంగా ఉండిపోయారు. ముఖ్యమంత్రి ఎలా చేస్తే .. ఎలా చెబితే.. అలా తలూపారు. చివరికి ఇప్పుడు వారంతా.. తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎన్నికల ప్రక్రియ జరిగి ఉంటే ఏపీలో ప్రమాదకర పరిస్థితులు..!
స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవి. రాష్ట్రం మొత్తం మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల హడావుడి ఉండేది. జనం గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు ఐదుగురు కన్నా ఎక్కువ గుమికూడకూడదని.. ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఎన్నికలంటే.. వందల మంది గుమికూడతారు. సభలు పెట్టుకుంటారు.. సమావేశాలు పెట్టుకుంటారు. ఫలితంగా.. ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా.. అది వందలు.. వేల మందికి వ్యాపిస్తుంది. అది ఎంత ప్రమాదకర పరిస్థితికి దారి తీసేదో… అంచనా వేయడం కష్టం. ఈ ప్రకారం.. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.
నిమ్మగడ్డ చేసింది కరెక్టేనని ఇప్పటికైనా వైసీపీ నేతలు ఒప్పుకుంటారా..?
వైసీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వాయిదాను.. కుట్ర కోణంలోనే చూస్తున్నారు. రమేష్ కుమార్ కు కులం ఆపాదించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా.., వారు రమేష్ కుమార్ చేసిన పని … తమను కాపాడిందన్న విషయాన్ని గుర్తిస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొండిగా ఎన్నికలు నిర్వహింపచేసి.. తర్వాత వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాన్ని వైసీపీ నేతలు ఇప్పుడు తప్పించుకోగలిగారు. దానికి రమేష్ కుమారే కారణం. ఇప్పటికైనా వైసీపీ నేతలు ఆయనకు క్షమాపణ చెప్పి.. ముందుచూపుతో నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాల్సి ఉంది. మరి.. వైసీపీ నేతలకు ఆ సహృదయత ఉందా..?